ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలతో ఉమ్మడి మెదక్ జిల్లా దద్దరిల్లింది. ఊరూరా చావుడప్పు మోగింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు,దిష్టిబొమ్మల దహనం చేపట్టి, సెగ ఢిల్లీ సర్కారుకు తాకేలా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు, రైతులు కదం తొక్కి ఆందోళనలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని, కేంద్ర వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా రైతులు ఫ్లకార్డులు చేతబూని నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండికేస్తున్నది. ఈ ప్రాంత రైతులపై చిన్నచూపు చూస్తున్నది. దీనిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామానా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల శవయాత్ర, దహనంతో పాటు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు నిరసన తెలిపారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించే వరకూ తమ పోరాటం ఆగదని బీజేపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కావాలని మొండికేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లకు దమ్ముంటే మోదీతో యాసంగి ధాన్యం కొంటామని చెప్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమాల్లో కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాకలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, సిద్దిపేటలో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, హవేళీఘనపూర్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మనోహరాబాద్‌లో మెదక్ జడ్పీ అధ్యక్షురాలు ర్యాకల హేమలత గౌడ్, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పటాన్‌చెరువులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు, అందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, నారాయణ్ ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.