భద్రాచలం, డిసెంబర్ 29: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిధిలో వచ్చే నెల 3వ తేదీ నుంచి ముక్కోటి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లు నిలిచిపోయిన ఉత్సవాలను ఈ ఏడాది రూ.కోటి నిధులతో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శననానికి ఇప్పటికే ఆన్లైన్ విధానం, ఆఫ్‌లైన్ విధానంలో టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. భక్తులు ఆలయ వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ వేడుకకు మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటవుతున్నాయి. వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ అనుదీప్ ఏర్పాట్లపై అధికారులతో సమాశాలు నిర్వహించారు. ఆలయ ఈఓ బానోత్ శివాజీ, డీఈ రవీందర్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
సిద్ధమవుతున్న హంస వాహనం..
వచ్చే నెల 12న గోదావరిలో హంస వాహనంపై శ్రీసీతారామచంద్రస్వామి తెప్పోతవ్సం జరుగనున్నది. ఆలయ అధికారులు ఉత్సవానికి ప్రత్యేకంగా ఏపీలోని రాజమండ్రి నుంచి లాంచీ తెప్పించారు. హంస వాహన సెట్టింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణంలో పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటవుతున్నాయి. గోదావరి తీరం, రాజరాజేశ్వరి గుడి, బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద అందంగా ద్వారాలు రూపుదిద్దుకుంటున్నాయి.