
సిద్దిపేట, జనవరి 3 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించి, అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు.15 నుంచి 18 ఏండ్ల వయస్సులోపు వారందరూ కరోనా టీకా వేసుకునేలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. 2007 సంవత్సరానికి ముందు పుట్టిన వారందరిపై దృష్టిపెట్టి పీహెచ్‌సీలకు తీసుకెళ్లి కరోనా టీకా వేయించాలని కోరారు. మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయి, రెండోడోస్ వేసుకునే వారిని గుర్తించి వారికి టీకా వేయించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, అసంపూర్తి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
ఊరూరా రైతుబంధు సంబురాలు…
రైతుబంధు సాయం రూ.50వేల కోట్ల చేరుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఊరూరా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ రూపాల్లో ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు నేరుగా రూ.50 వేల కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. ఎనిమిది విడుతల్లో అందించిన రైతుబంధు సాయంతో అన్నదాతలు పంట పెట్టుబడులకు రంది లేకుండా పోయిందన్నారు. సిద్దిపేట పట్టణాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యంగా మున్సిపల్ కౌన్సిలర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా కౌన్సిలర్లు బాగా పనిచేస్తున్నారని, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో వార్డుల్లో దృష్టిపెట్టి పనిచేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో సిద్దిపేట నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు 180 మంది పాల్గొన్నారు.