
రైతుబంధు వారోత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. నాల్గో రోజూ గురువారం వ్యవసాయం, రైతుబీమా, రైతుబంధుపై ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మహిళలు బతుకమ్మ ఆడి పాడారు. పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు తీయగా, ఫ్లెక్సీలు పట్టుకుని రైతులు జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మాట్లాడుతూ రైతుబంధుతో అన్నదాతల జీవితాల్లో వెలుగులు నిండాయని, పెట్టుబడికి ఇక్కట్లు తప్పి సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నారని అన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.50వేల కోట్ల ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో వేసిందని, దేశంలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదని అన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కరువుతీరా నీళ్లిచ్చి, ఉచిత కరెంటిచ్చి, పెట్టుబడికి పైకమిస్తూ, బీమాతో ధీమానిస్తూ అన్నితీర్లా ఆసరా అవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రైతన్నల అభిమానం ఆకాశాన్నంటుతున్నది. బండెనక బండి కట్టి.. తీరొక్క పూలు, పంట ఉత్పత్తులతో ముగ్గులేసి.. నారుతో పేర్లు రాసి.. క్షీరాభిషేకాలు చేసి రైతుబాంధవుడు కేసీఆర్‌కు జైకొడుతున్నది. రైతుబంధు వారోత్సవాల్లో నాల్గో రోజైన గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఎడ్లబండ్లపై సీఎం కేసీఆర్ చిత్రపటంతో డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ తీయగా, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా చేర్యాల గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ‘నాటి తెలంగాణ-నేటి తెలంగాణ’ వ్యాసరచన పోటీలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పర్యవేక్షించి, విజేతలకు బహుమతులు అందజేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎడ్లోళ్లు ఎటు పోయిన్రో..
రైతుబంధు పథకానికి ముందు గ్రామాల్లో సాగు కోసం మిత్తికి డబ్బులు ఇచ్చేందుకు వ్యాపారులు వస్తుండే. లాగోడికి ఎంత కష్టమతుండేనో ఆ వ్యాపారుల దగ్గర మిత్తికి తీసుకున్న వారికి అడిగితే తెలుస్తుంది. అలా ఎడ్లోళ్ల వద్ద మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గిర్నికాడి నర్సయ్య అనే రైతు డబ్బులు తీసుకున్నాడు.
అప్పటి ముచ్చట ఆయన మాటల్లోనే..
సుమారు పదేండ్ల క్రితం ఎడ్లోళ్లు అనే వడ్డీ వ్యాపారులు గ్రామాల్లో పంట పెట్టుబడికి వడ్డీకి డబ్బులు ఇచ్చేటోళ్లు. కేవలం బ్రాహ్మణపల్లి గ్రామమే కాకుండా చుట్టు పక్కల గల పది గ్రామాలకు మిత్తికిచ్చేటోళ్లు. పంట నారు పోసే యాళ్లకు గ్రామాల్లోనే రెండు నెలల దాకా వాళ్లు ఉండేటోళ్లు.. రైతులకు పైసలు ఇచ్చేటోళ్లు.. వాళ్లు లెక్కగట్టే వడ్డీని జూస్తే, కండ్లు దిరిగే పడిపోయేట్టు ఉండేది. రూ.వందకు రూ.30 కాడికి ఇస్తుండే. అప్పట్లో రైతులకు ఆదాయం లేక ఎడ్లోళ్ల కాడ తీసుకుంటుండే. ఆరు నెలల తర్వాత పంట చేతికొచ్చినాంక ముక్కు పిండి వసూలు చేస్తుండే. వచ్చిన దిగుబడి కాస్తా, మిత్తిలకే సగం అయిపోవడంతో రైతన్నలు నానా బాధలు పడేటోళ్లు. ఒక యాళ పంట దిగుబడి రాక, వాళ్లకు పైసలు ఇయ్యకపోతే, గాయిగాయి చేస్తుండే. రైతు తన పొలంలో వేసే పంటను బట్టి మిత్తికి డబ్బులిస్తుండే. నేను కూడా పదేండ్ల కింద పంట కోసం రూ.20వేలు మిత్తికి తీసుకున్న. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుతో పెట్టుబడికి డబ్బులియ్యడం మొదలు పెట్టింది. గప్పటి నుంచి రైతులు వడ్డీ వాళ్ల దగ్గరికి పోవడం మానేశిన్రు. వడ్డీ వ్యాపారులు సుత క్రమక్రమంగా ముల్లే మూట సర్దుకొని, వాళ్ల సొంత ఊర్లకు పోయిన్రు. గప్పటి నుంచి గిప్పటి వరకు వడ్డీ వ్యాపారులు గ్రామాలల్ల కనిపిస్తలేరు. రైతుబంధుతో ఎంత మేలు జరిగిందో ఆలోచించాలి. కేవలం ఎడ్లోళ్లే కాకుండా చాలా మంది వడ్డీ వ్యాపారులు గ్రామాలపై పడి రైతుల నుంచి బంగారాన్ని సైతం గిరి పెట్టుకొని, పెట్టుబడికి డబ్బులు ఇచ్చేవారు. కొందరు రైతులు డబ్బులు కట్టలేక బంగారాన్ని కూడా కోల్పోయినరు. గిప్పుడు ఆ రోజులు లేవు. ఇవాళ్ల మా ఊర్ల ఒకటే ముచ్చట అనుకుంటం. మా కొడుకు డబ్బులు ఇచ్చాడా? కేసీఆర్ డబ్బులు వేశాడా? అని మేం మాట్లాడుకుంటం.. ఆయన సల్లంగా ఉండాలె.