
ఖమ్మం, జనవరి 3: తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రారంభించిన రైతుబంధు పథకం దేశంలోనే రైతాంగ అభివృద్ధిలో కీలక మజిలీకి చేరుకుందని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. ఈ నాలుగేళ్లలో ఎనిమిది సీజన్లకు రూ.50,682.30 కోట్లను పంటల పెట్టుబడిగా అన్నదాతలకు అందించినట్లు వివరించారు. రైతుల సమస్యలు, ధాన్యంపై కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వనీతి అవలంబిస్తున్నాయని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వడం సాహసోపేతమైన కార్యాచరణ అని అభివర్ణించారు. టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రపంచంలో ఎకడా రైతుబంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకొన్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. పంటల పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలను ఆదుకుంటున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలోని పల్లెలన్నింటిలో 10వ తేదీ వరకు పండుగ వాతావరణం నెలకొనేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.