వనస్థలిపురం : పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి, రైతులను మోసం చేసిన పచ్చి దగాకోరు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోవాలని కోరుతు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీఫ్‌లిక్కర్ పార్టీ అయిన బీజేపీ మద్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పసుపు రైతులకు సమాదానం చెప్పలేని వ్యక్తి మహా నాయకుడిపై చిల్లర పోస్టులు పెడుతున్నాడన్నారు.
దమ్ముంటే పసుపు బోర్డు తీసుకురావాలని, దేశ వ్యాప్తంగా లిక్కర్ బంద్ చేయించాలని సవాలు విసిరారు. తెలంగాణ తెచ్చి, బంగారు తెలంగాణగా నిర్మిస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. ఆయనపై అనుచిత పోస్టులు పెడుతున్న అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
24 గంటల్లోగా కేసీఆర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అర్వింద్ ఇంటిని ముట్టడిస్తామని, తెలంగాణలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.