
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం ఈనెల 14న ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం ప్రత్యే కంగా సమీక్షించారు. కౌంటింగ్ సిబ్బంది శిక్షణలో పాల్గొని పలు సూచనలు చేశారు. కౌంటింగ్ విధానం, కౌంటింగ్ హాల్లో ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై వీరికి వివరించారు. కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని, ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుండగా సిబ్బంది ఉదయం 6.30 కల్లా రిపోర్ట్ చేయాలని సూచించారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించనున్నట్లు చెప్పారు. లేనిపక్షంలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తీసుకుని లోపలికి రావాల్సి ఉంటుందన్నారు సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఏఓ మోతీలాల్, నల్లగొండ తాసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి, ఎన్నికల డీటీ విజయ్‌కుమార్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, బాబు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు ఇలా..
ఈ ఎన్నికల్లో మొత్తం 1,271 ఓట్లు ఉండగా అందులో 1,233 ఓట్లు పోలయ్యాయి. వీటి లెక్కింపు కోసం నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యాక మందుగా టేబుళ్లపైకి స్ట్రాంగ్‌రూమ్స్ నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తెచ్చి బ్యాలెట్ పత్రాలన్నింటినీ బండిల్స్‌గా వేరు చేస్తారు. 25 బ్యాలెట్లను ఒక బండిల్‌గా ఏర్పాటు చేస్తారు. ఇలా ఏకకాలంలో నాలుగు టేబుళ్లపై బండిల్స్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇది పూర్తయ్యాక మొత్తం ఓట్లను నాలుగు టేబుళ్లకు సమానంగా పంచుతారు. అంటే మొదటి మూడు టేబుళ్లకు 300 చొప్పున నాలుగో టేబుల్‌కు మిగిలినవన్నీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా ఇచ్చాక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు. ఇవి అన్ని టేబుళ్లపై పూర్తయ్యాక చెల్లని ఓట్ల లెక్క తేలుస్తారు. అనంతరం చెల్లిన ఓట్లను ఆధారంగా గెలుపు కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటిని కలిపితే గెలుపు కోటా కానుంది. అప్పటికే ఈ గెలుపు కోటాను దాటి ఎవరైనా ఓట్లు సాధిస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. లేనిపక్షంలో ఎలిమినేషన్ ప్రక్రియలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థ్ధి కోటాను సాధించేంత వరకు కొనసాగనుంది. కానీ పోలింగ్ సరళిని బట్టి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపొందవచ్చని అంచనా. ఇదే జరిగితే ఎలిమినేషన్ అవసరం లేకుండానే లెక్కింపు పూర్తి కానుంది.