అంగన్వాడీ కేంద్రాల సేవలు త్వరలో ఆన్లైన్లో నమోదు కానున్నాయి. చిన్నారుల హాజరు, మధ్యాహ్న భోజనం, బాలింతలకు పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు తదితర అన్ని అంశాలను రోజువారీగా ‘పోషణ్ ట్రాకర్’ అనే యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఇందుకోసం టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను త్వరలోనే అందజేస్తారు. దీంతో టీచర్ స్థాయి నుంచి ప్రాజెక్టు, జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు ప్రతి అంగన్వాడీలో అందుతున్న సేవలను తెలుసుకునే అవకాశం ఉన్నది. ఈ విధానంతో కేంద్రాల్లో అవకతవకలు చెక్ పడనుండగా, సేవలన్నీ పారదర్శకంగా అమలు కానున్నాయి.
సంగారెడ్డి, డిసెంబర్ 10 : అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయడంతో పాటు పర్యవేక్షణ కోసం టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు రోజువారీగా అందించే పౌష్టికాహార వివరాలతో పాటు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో 1504 అంగన్వాడీల్లో 1.20 లక్షల చిన్నారులకు విద్యాబోధన, ఆరోగ్య పరిరక్షణతో పాటు బాలింతలు, గర్భిణులకు టీచర్లు సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం మేరకు మాతాశిశు మరణాలు తగ్గించడం, పిల్లల్లో పోషణ లోప స్థితి లేకుండా చేసి పోషక స్థాయిని మెరుగుపరచడం, రక్తహీనతను నివారించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పిల్లలు, మహిళలకు అన్నం, పప్పు, ఆకుకూరలు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు అందిస్తూ అంగన్వాడీలపై నమ్మకం కలిగిస్తున్నారు. ఇలాంటి సేవల వివరాలను రోజు వారీగా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రత్యేక పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ యాప్లో టీచర్ నుంచి ప్రాజెక్టు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు ప్రతి అంగన్వాడీలో అందుతున్న సేవలను తెలుసుకునే అవకాశం ఉన్నది. ఇందుకు కావాల్సిన స్మార్ట్ఫోన్లు జిల్లా కేంద్రం సంగారెడ్డికి 25 రోజుల క్రితమే వచ్చాయని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే టీచర్లు, సూపర్వైజర్లకు అందజేసి వివరాల నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఆరోగ్య పరిరక్షణకు పోషణ్ అభియాన్..
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మెరుగైన సేవలు అందించేందుకు పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పోషణ లోపంలేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బరువు, ఎత్తు కొలిచి వారి పోషక స్థాయి ఎలా ఎందో గమనించి.. టీచర్లు, సూపర్వైజర్లు ఇండ్లను సందర్శిస్తూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. టీ-శాట్ కార్యక్రమంతో పిల్లలకు ప్రీ-స్కూల్ కార్యక్రమాల్లో నేర్చుకుంటున్న అంశాలపై పర్యవేక్షణ చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని 1344 మెయిన్, 160 మినీ అంగన్వాడీల్లో సేవలను నిరంతరం కొనసాగిస్తున్నారు. పోషణమాసం సందర్భంగా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యం కల్పిస్తున్నారు.
నిరంతరం పర్యవేక్షణ…
అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మారుమూల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వరకు ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 11,518 మంది గర్భిణులు, 10,140 బాలింతలు, 0-6 నెలల లోపు చిన్నారులు 10,140, ఏడు నెలల నుంచి ఏడాది పిల్లలు 10,695, 1 నుంచి 3 ఏండ్ల వారు 42,514, 3 నుంచి 6 ఏండ్ల వారు 35,061 మంది ఉన్నారు. వీరందరికీ రోజు వారీగా అందుతున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు ‘పోషణ్ ట్రాకర్’ యాప్లో నమోదు చేస్తారు.
సేవలన్నీ ఆన్లైన్లోనే…
అంగన్వాడీల సేవలను ఇక నుంచి ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వం టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించి పోషణ్ ట్రాకర్ యాప్లో లాగిన్ కావాలి. ప్రతి రోజు చిన్నారుల హాజరుతో పాటు ఎంతమంది వచ్చారో ఫొటోతీసి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. మధ్యాహ్నం భోజన సమయంలో ఎంతమంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించామన్నది ఫొటోతీసి అప్లోడ్ చేయాలి. కేం ద్రంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు, వీరిలో ఎంత మందికి టీకాలు వేశారు, నవజాత శిశువులు, పిల్లల ఎదుగుదల ఎలా ఉందనే వివరాలతో పాటు వారి ఎత్తు, బరువును యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
కోడ్ ముగిసిన వెంటనే పంపిణీ..
ప్రభుత్వం అంగన్వాడీ కేం ద్రాలకు అందించిన స్మార్ట్ఫోన్లను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పంపిణీ చేస్తాం. ఇప్పటికే జిల్లాకు 1564 ఫోన్లు వచ్చాయి. వీటిని మహిళా ప్రాంగణంలోని మహిళా వసతిగృహంలో భద్రపరిచాం. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒక ఫోన్ ఇస్తాం. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందుతున్న సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ ద్వారా యాప్లో నమోదు చేస్తాం. ఏ కేంద్రంలో ఎంతమంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉన్నారు అనే విషయం ఏ రోజుకారోజు తెలుస్తుంది. పౌష్టికాహారంతో పాటు కోడిగుడ్ల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా పక్కా సమాచారం ఉంటుంది.
-పద్మావతి, డీడబ్ల్యూవో సంగారెడ్డి