జూలూరుపాడు, జనవరి 6 : అనారోగ్య సమస్యలకు మూలకారణం పోషకాహార లోపమే అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐఈఎంఆర్)శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని బేతాళపాడులో కిడ్నీ బాధితులు అధికంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఆదేశాల మేరకు ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల నుంచి రక్తనమూనాలు సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ… గ్రామంలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో తాగునీరు, ఆహార పదార్థాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించిన రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లోని 60శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు తాగి వ్యాధులను దూరం చేసుకోవాలన్నారు. భగీరథ నీటి పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ఆరోగ్య తెలంగాణగా ముందుకెళ్తున్నదన్నారు. కిడ్నీ వ్యాధుల మూలాలను గుర్తించేందుకు వైద్యసిబ్బంది చేస్తున్న ప్రయత్నానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎం హెచ్వో శిరీష, డిప్యూటీ డీఎంహెచ్వో దయానంద్, మలేరియా వైద్యుడు వీరబాబు, తహసీల్దార్ లూధర్ విల్సన్, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్ గుగులోత్ రాందాస్ నాయక్, జడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపీటీసీ నర్సమ్మ, వైద్యుడు శ్రీధర్, వెంకటప్రసాద్, వైద్య సిబ్బంది, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌడం నర్సింహారావు, నాయకుడు రామిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.