సాగు, ఉపాధి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నారు సీఎం కేసీఆర్.. వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.. ఇప్పుడు కూలీలు బతకడం కోసం వలస వెళ్లే అవసరమే లేకుండాపోయింది.. అంతేకాదు ఏటికేడు ఇక్కడ పంటల విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ పనులు పుష్కలంగా దొరుకుతున్నాయి.. దీంతో పొరుగు రాష్ర్టాల నుంచి కూలీలు ఇక్కడికి తరలివస్తున్నారు.. ఈ సీజన్లో ఉపాధి పొందేందుకు భద్రాద్రి జిల్లాకు 20 వేల మంది వచ్చారు.. వలస కూలీలను ఆదుకుంటున్నది రాష్ట్ర సర్కార్. గతేడాది కరోనా సమయంలో కూలీలకు రేషన్ అందించింది. ప్రత్యేక వాహనాల్లో వలస జీవులను స్వస్థలాలకు పంపించింది. మరే ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ఆదరించనంతగా తెలంగాణ ప్రభుత్వం కూలీలను అక్కున చేర్చుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 9 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను అందిస్తున్నది. నీటి వనరులను సంరక్షిస్తున్నది. ప్రాజెక్టుల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నది. దీంతో రాష్ట్రంలో విస్తారంగా పంటలు సాగవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో మిర్చి, పత్తి, వరి పంటలు విస్తారంగా పండుతాయి. పంటల సాగుతో స్థానిక కూలీలకే కాక పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన వలస జీవులకు ఉపాధి దొరుకుతున్నది. జిల్లాకు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా నుంచి ఎక్కువగా కూలీలు వస్తారు. ఏడాదిలో మూడు నెలల పాటు ఇక్కడే మకాం వేస్తారు. వానకాలం పంట కోతకు వచ్చిన సమయంలో రాష్ర్టానికి వచ్చి మూడు నెలల తర్వాత సొంత రాష్ర్టాలకు వెళ్తారు.
జిల్లాలో 20 వేల మంది వలస కూలీలు..
భద్రాద్రి జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, సులానగర్, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు ఎక్కువగా పొరుగు రాష్ర్టాల నుంచి వలసలు ఉంటాయి. ఏటా జిల్లాకు 20 వేల మంది వలస వలస వస్తారు. ఏడాదిలో మూడు, నాలుగు నెలలు ఇక్కడే ఉండి సంపాదించుకుంటారు. తమ పాలనే గొప్ప అని భావించే బీజేపీ పాలిత రాష్ర్టాల నేతలు ఇక్కడికి వచ్చిన కూలీల జీవితాలను చూస్తే బాగుంటుంది. వలస కూలీలనూ తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటున్నది. అత్యధికంగా జిల్లాలో జూలూరుపాడు మండలానికి 800 మంది వలస వచ్చారు. మండలంలో పది వేల ఎకరాల్లో మిర్చి సాగవుతున్నది.
ఛత్తీస్గఢ్లో పనులు లేవు..
మా రాష్ట్రంలో పంటలు సరిగా పండవు. ఏడాదిలో ఎక్కువ కాలం కూలి దొరకదు. బతకడం కోసం కుటుంబాలతో కలిసి తెలంగాణ వస్తున్నాం. ఇక్కడి రైతులు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మేం ప్రస్తుతం జూలూరుపాడులో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం. అందినంత సంపాదించుకుని తిరిగి మా స్వస్థలాలకు వెళ్తాం.
-మిర్రా సురేశ్, కువ్వకుండ, ఛత్తీస్గఢ్
లాక్డౌన్లో సర్కార్ ఆదుకున్నది..
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో దేశమంతా లాక్డౌన్ అమలైంది. అన్ని రాష్ర్టాలూ లాక్డౌన్ను అమలు చేశాయి. ఆ సమయంలో మేం ఎంతగానో భయపడ్డాం. తెలంగాణకు వలస వచ్చి కూలి పనులు చేసుకుంటున్న మమ్మల్ని ఇక్కడి ప్రభుత్వం ఆదుకున్నది. రేషన్ షాపుల ద్వారా బియ్యం అందించింది. అవసరాన్ని బట్టి ప్రత్యేక వాహనాల్లో వలస జీవులను స్వరాష్ర్టాలకు పంపించింది. నేనూ ఒడిశా వెళ్లా. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి తెలంగాణకు వచ్చాం. పని చేసుకుంటున్నాం.
ఇక్కడే ఆవాసం..
పొరుగు రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వారు జిల్లాకు వచ్చి ఇక్కడే తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వలస వచ్చిన వారు ఇక్కడే స్థిరపడిపోయారు. ములకలపల్లి, లక్ష్మిదేవిపల్లి, అశ్వారావుపేట, టేకులపల్లి, చుంచుపల్లి, జూలూరుపాడు, చర్ల మండలాల్లో ఎంతో మంది స్థిరపడ్డారు. కరోనా సమయంలో వేలాది మంది వలస జీవులను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం. వారికి రేషన్ అందించింది. ప్రత్యేక వాహనాల్లో సొంత రాష్ర్టాలకు పంపించింది.