కవాడిగూడ : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు అంజయ్యనగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్‌పూర్ డివిజన్లోని అంజయ్యనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పొజిషన్ సర్టీఫికేట్లను ఆయన సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, ముషీరాబాద్ తహశీల్దార్ జానకీలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ అంజయ్యనగర్‌లో కోర్టు కేసులో ఉన్న స్థలం సమస్యను పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న 18 మందికి కూడా త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లు అందేలా కృషి చేస్తామని అన్నారు. మొత్తం 55 మందికిగాను 35 ఇండ్లను మొదటి విడతగా కేటాయించామని ఆయన తెలిపారు.
మిగతా 18 మందికి డబుల్ ఇండ్లు వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. పేద ప్రజలు ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి సత్వర న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, రాంనగర్ అధ్యక్షుడు ఆర్. మోజెస్, భోలక్‌పూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఏ. శంకర్ గౌడ్, ఎం. రవీందర్, బడుగు ప్రవీణ్‌కుమార్, మైనారిటీ అధ్యక్ష, కార్యదర్శులు మక్బూల్, జబ్బార్, రహీం, గోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.