
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 24: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది అక్టోబర్లో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. ఇటీవల పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారందరినీ తిరిగి పాస్ చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల నుంచి మొత్తం 17,893 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 9,077 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 51శాతం ఉత్తీర్ణత నమోదైంది. 8,816 మంది ఫెయిల్ అయ్యారు. భద్రాద్రి జిల్లా నుంచి 10,820 మంది పరీక్షలకు హాజరు కాగా 5,341 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 49 శాతం నమోదైంది. 5,479 పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వీరందరూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాస్ కానున్నారు. ప్రకటనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.