సంగారెడ్డి, డిసెంబరు 22: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో లబ్ధిదారులు ఆదాయం సాధించి, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చౌరస్తాలోని తాహెర్ ఫంక్షన్హాల్లో ఎస్బీఐ రుణ వితరణ కార్యక్రమాన్ని బుధవారం బ్యాంకు అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ హాజరయ్యారు. ఆయనకు స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్, అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని ఎస్బీఐ బ్యాంకు శాఖల మేనేజర్లు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు స్టాండప్ ఇండియా, ముద్ర, పీఎంఈజీపీ, స్వయం సహాయక సంఘాల మహిళలు ఎంపికైన లబ్ధిదారులకు రూ.20 కోట్ల రుణాల చెక్కులను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల్లో చైతన్యంతోనే అభివృద్ధి జరుగుతుందని, ఇందుకు తెలంగాణలోని మహిళలు నిదర్శనంగా కనిపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక్కో సంఘానికి రూ.10 లక్షల రుణాలు ఇచ్చామని, ఇక నుంచి రూ.20 లక్షలు ఇచ్చేందుకు బ్యాంకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకుని కుటుంబ అవసరాలకు కాకుండా ఆర్థిక భరోసానిచ్చే పనులకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు బ్యాంకులు ముందుంటాయని, అర్హతను బట్టి రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లిస్తే తిరిగి రెట్టింపు రుణాలు పొందే అవకాశం ఉంటుదన్నారు. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంకులు రూ.20 కోట్ల రుణాలను ప్రభుత్వాలు అమలు చేసిన స్టాండప్ ఇండియా, ముద్ర, పీఎంఈజీపీ, మహిళా సంఘాల సభ్యులకు ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీరాంసింగ్, ఏజీఎం కల్యాణ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణారెడ్డి, ఎస్బీఐ బ్యాంక్ శాఖల మేనేజర్లు సిబ్బంది, సెర్ఫ్ ఏపీఎంలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.