చిగురుమామిడి,డిసెంబర్ 31: మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థికవృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ముందుండాలని నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ మనోహర్‌రెడ్డి సూచించారు. సుందరగిరిలో జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) సహకారంతో జన వికాస గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 రోజులు మైక్రో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 30 మంది మహిళలకు శుక్రవారం సర్పంచ్ శ్రీమార్తి రమేశ్ తో కలిసి సర్టిఫికెట్లు, ట్రైనింగ్ ైస్టెఫండ్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన 30 మంది మహిళలకు 750 రూ.చొప్పున రూ.22,500 చెకులు అందజేశామన్నారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. సర్పంచ్ మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో గ్రామంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శి సంపత్‌కుమార్, రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ గైని తిరుపతి, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, సీఏ వసంత, రాజమౌళి, రాజు, మహిళలు ఉన్నారు.