
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది.. జిల్లావ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అధికారులు ఇప్పటికే లక్ష టన్నులు సేకరించారు. వచ్చే నెల మొదటి వారం వరకు మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు కలుగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ధాన్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసింది.
ఆధార్ కార్డు అనుసంధానం..
జిల్లాలో 249 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. గురువారం నాటికి అధికారులు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతుల ఖాతాల్లో రూ.200 కోట్ల వరకు జమ చేయాల్సి ఉన్నది. ఇప్పటికే రూ.100 కోట్ల నగదు జమ చేశారు. రైతులు ధాన్యం విక్రయించిన వారం రోజుల లోపు రైతుల ఖాతాల్లో నగదు జమఅవుతున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి చేయడంతో దళారుల మధ్యవర్తిత్వం లేకుండాపోయింది.
లక్ష్యాన్ని అధిగమించే దిశగా..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 171 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఐదు, డీసీఎంఎస్‌ల ద్వారా 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇలా ప్రస్తుతం 249 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. జిల్లాలో 1,19,657 హెక్టార్లలో వరి సాగు చేయగా వ్యవసాయశాఖ అధికారులు 7,13,455 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దీనిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. జనవరి మొదటి వారంలోపు మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నది. కొనుగోలు కేంద్రాలకు 62 లక్షల బస్తాలు కేటాయించారు. ఇప్పటికే కేంద్రాలకు 40 లక్షల బస్తాలు అందాయి. ప్రస్తుతం 27,67,213 ధాన్యం బస్తాలు సిద్ధంగా ఉన్నాయి.
రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా..
జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఆంధ్రా నుంచి రాష్ర్టానికి ధాన్యం రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముదిగొండ మండలంలోని వల్లభి, బోనకల్తో పాటు ఇదే మండలంలోని చొప్పకట్లపాలెం, వైరా మండలంలోని గంగవరం, మధిర మండలంలోని ఇల్లూరు, ఎర్రుపాలెం, వేంసూరు మండలంలోని కేజీ మల్లేల, పెనుబల్లి మండలంలోని ముత్తగూడెం ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.
ఖమ్మం, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలంలో రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం శరవేగంగా కొనుగోలు చేస్తున్నది. ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలోనే ముందుగా వరి కోతలు ప్రారంభమవడంతో అధికారులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధాన్యం కొనుగోళ్లపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండాలన్నారు. గన్నీ బ్యాగుల సమస్య తలెత్తకుండా ముందుగానే తెప్పించుకోవాలన్నారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు..
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేశాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో రోజుకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.. అనే విషయంపై నిత్యం సమీక్షిస్తున్నాం. ఇప్పటికే సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
-మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం