భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/మణుగూరు రూరల్, డిసెంబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరికుంట పరిధిలోని గోదావరిపై సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించి మాట్లాడారు. రూ.3,480 కోట్లతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నదన్నారు. ప్రాజెక్టు పరిధిలో 40 కిలోమీటర్ల కుడి కాలువ, 56 కిలో మీటర్ల ఎడమ కాలువ ఉంటుందన్నారు గోదావరికి అనుబంధ వాగులకు రక్షణ బండ్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన 3,123 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 510 ఎకరాలు సేకరించామన్నారు. మిగిలిన భూములనూ ఐదు రోజుల్లో ఇరిగేషన్ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. అనంతరం పరిహారం పెంపుపై రిలే దీక్ష చేపడుతున్న అమ్మగారిపల్లె, కుమ్మరిగూడెం రైతులతో మాట్లాడారు. కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన రైతులకు సమాధానమిచ్చారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాసరెడ్డి, రాంప్రసాద్, బాబూరావు, ఎల్అండ్టీ డీజీఎం రాజేశ్ చౌహాన్, అశ్వాపురం, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం తహసీల్దార్లు సురేష్, ప్రసాద్, నాగేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు.