
సంగారెడ్డి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) :‘స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకే బలముంది.. విజయం మనదే’.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అందోల్‌లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన సమావేశాలు జరుగగా, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉందని, టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో 880 ఓట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థి యాదవరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సరైన బలం లేనప్పటికీ కాంగ్రెస్ పోటీ చేస్తున్నదని, ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తథ్యమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించింది. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అందోల్‌లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. మూడు నియోజకవర్గాల్లోని మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాలకు మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థలు బలోపేతం అవుతున్నట్లు చెప్పారు. జడ్పీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా యాదవరెడ్డి బరిలో ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గల్లో టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు ప్రతిఒక్కరూ పార్టీ అభ్యర్థి యాదవరెడ్డికి ఓటు వేయాలన్నారు.
టీఆర్ఎస్కు ఉమ్మడి మెదక్ జిల్లాలో 880 ఓట్లు ఉన్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొండడం ఖాయమన్నారు. సరైన బలం లేనప్పటికీ కాంగ్రెస్ పోటీ చేస్తున్నదని, ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తథ్యమన్నారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా టీఆర్ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు నడుచుకోవాలని సూచించారు. పార్టీపై విశ్వసనీయతతో పని చేసే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలన్నది జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇకపై సంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను రూ.4,427 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రెండు ఎత్తిపోతల పథకాలకు పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలంతా తప్పకుండా కొవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ చేయించుకోని వారు వెంటనే వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు.
సుదర్శన హోమంలో పాల్గొన్న మంత్రి
నర్సాపూర్/మనోహరబాద్, నవంబర్ 30 : మెదక్ జిల్లా శివంపేట మండల పరిధి పెద్దగొట్టిముక్ల గ్రామ సమీపంలో గల చాకరిమెట్ల ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హోమానికి కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న సీతారాముల దేవాలయాన్ని పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ హరికృష్ణ ఉన్నారు.
జిమ్ ప్రారంభించిన మంత్రి
సంగారెడ్డి అర్బన్, నవంబర్ 30 : పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ను మంగళవారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు హకీం, వాజిత్, జిమ్ నిర్వాహకులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత వర్మ
అందోల్, నవంబర్ 30 : అందోల్ నియోజకవర్గంలో బీజేపీ రోజురోజుకూ బలహీన పడుతున్నది. ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. అందోల్ మండలంలో బీజేపీ సీనియర్ నేత, జోగిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినారాయణవర్మ మంగళవారం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ చేరగా, వారికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్‌గుప్తా, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు అశోక్, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలందించండి
నారాయణఖేడ్ ఏరియా దవాఖానను తనిఖీ చేసిన మంత్రి
నారాయణఖేడ్, నవంబర్ 30 : సేవాభావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మంత్రి, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి నారాయణఖేడ్ ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. సదుపాయాలు, అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంతకాలు చేస్తున్న రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యే విధంగా చూడాలని సూపరింటెండెంట్ నర్సింగ్చౌహన్కు సూచించారు. 15 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారని, ఒకరిద్దరు డిప్యుటేషన్‌పై వేరే దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్నారని సూపరింటెండెంట్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి దవాఖానలో రక్తనిధి, ఎక్స్‌రే విభాగం, డయాలసిస్ విభాగాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు.