వరి సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. యాసంగి ధాన్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్రం ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత యాసంగి సీజన్లో కేవలం 696 ఎకరాల్లోనే వరిని వేసిన రైతులు.. శనగ, జొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, మినుములు, ఆకుకూరులు, కూరగాయలు పండించేందుకు మొగ్గుచూపారు. ఇప్పటి వరకు అత్యధికంగా 26,206 ఎకరాల్లో శనగ సాగు చేస్తుండగా, ఇంకా సమయం ఉన్నందున పంట విస్తీర్ణం 30 వేల ఎకరాలు దాటే అవకాశం ఉందని, అలాగే 6627ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారని వ్యవసాయశాఖ పేర్కొంటున్నది. కాగా, ప్రతీ రైతు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని, ప్రభుత్వ, వ్యవసాయశాఖ సలహాలు , సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ఊరూరా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా రైతాంగం యాసంగిలో వరికి బదులు శనగ, జొన్న ఇతర ఆరుతడి పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి సాగు చేయవద్దని, వరి స్థానంలో ఇతర పంటలు పండించాలని రైతులకు సూచించింది. దీంతో, ఆ దిశగా అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది (2020-21) యాసంగిలో 81,507 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఈ ఏడాది అధికారుల సూచనల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్ (2021-22)లో ఇప్పటి వరకు 696 ఎకరాల్లో మాత్రమే వరి వేశారు. 41,236 ఎకరాల్లో శనగ, జొన్న, కుసుమ తదితర ఆరుతడి పంటలను సాగుచేశారు. కాగా, 26,206 ఎకరాల్లో శనగ పంట వేశారు. ఇంకా సమయం ఉన్నందున పంట విస్తీర్ణం 30వేల ఎకరాలు దాటే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. శనగతో పాటు ఎక్కువగా 6153 ఎకరాల్లో జొన్నపంట పండిస్తున్నారు. కుసుమ 3935 ఎకరాలు, వేరుశనగ 725 ఎకరాలు, మొక్కజొన్న 895 ఎకరాలు, మినుములు 301 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే, పొద్దుతిరుగుడు 677 ఎకరాలు, చెరుకు 1179 ఎకరాలు, నువ్వులు 39 ఎకరాలు, గోధుమ 296 ఎకరాలు, సోయాబీన్ 27 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాల్లో వేశారు. వరి స్థానంలో ఆరుతడి పంటలు వేసుకోవడం లాభదాయకమని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
ఆరుతడి పంటల సాగుకు రైతుల ఆసక్తి..
జిల్లా రైతులు వరి స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది. వరి వేయవద్దని, ఇతర పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ, వ్యవసాయశాఖ సూచనల మేరకు రైతులు కూడా వరికి బదులు శనగ, జొన్న, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో శనగ సాగు 30వేల ఎకరాలు దాటే అవకాశం ఉంది. ఆరుతడి పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరల సాగును చేపడుతున్నారు.
కూరగాయల సాగుకు మొగ్గు..
సంగారెడ్డి జిల్లాలో రైతులు ప్రస్తుత యాసంగి సీజన్లో కూరగాయలు, ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. ఉద్యానవనశాఖ అధికారుల సమాచారం ప్రకారం మొత్తం 6627 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. టమాట 950, ఉల్లిగడ్డ 1350, పచ్చి మిర్చి 290, బెండకాయ 100, సొరకాయ 45, బీరకాయ 30, కాకరకాయ 36 ఎకరాల్లో సాగు చేశారు. వీటితో పాటు వంకాయ 210, ఆకుకూరలు 225, చిక్కుడు కాయలు 90, ఎండుమిర్చి 90 ఎకరాల్లో పండిస్తున్నారు. యాసంగి సీజన్లో జహీరాబాద్ ప్రాంత రైతులు అత్యధికంగా 3050 ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేశారు. అలాగే, క్యారెట్ 75, క్యాబేజీ 50, క్యాలీప్లవర్ 48, మునగ 21, ఇతర కూరగాయలను 100 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే, 94 ఎకరాల్లో అల్లం, వెల్లుల్లి పంటలను వేశారు.