ఇప్పటికే జిల్లాలో 9,330 ఎకరాల గుర్తింపు
తీగరాజుపల్లి నర్సరీలో పెరుగుతున్న 3.10 లక్షల మొక్కలు
90 శాతం సబ్సిడీపై మొక్కలు అందజేత
పర్వతగిరిలో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు
వర్ధన్నపేట, డిసెంబర్ 29:ఆయిల్‌పామ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరిధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుండడంతో అన్నదాతలు ఇతర పంటల సాగు వైపు మళ్లుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యానశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.30వేల చొప్పున మూడేళ్లు ఆర్థిక సహకారం అందించడంతోపాటు 90శాతం సబ్సిడీపై మొక్కలను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తీగరాజుపల్లి నర్సరీలో 3.10 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే కర్షకుల జాబితానూ సిద్ధం చేశారు. వచ్చే సంవత్సరం 9,330 ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2022 జూన్‌లో మొదటి దశ, అక్టోబర్‌లో 2వ దశ రైతులకు మొక్కలను అందించనున్నారు.
వరికి బదులు ఇత ర పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎన్నో ప్రయోజనాలున్న ఆయిల్‌పామ్ పంటను సాగు చేసుకోవాలని సీఎం కేసీఆర్ స్వ యంగా రైతులకు సూచించడంతోపాటు ఇందుకు తగినట్లుగా రాష్ట్రంలో ఉద్యాన వనశాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. జిల్లాల వారీగా పంటకు అనువుగా ఉన్న భూములను స్థిరీకరించి ఆ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్లకు పంట వచ్చే అవకాశం ఉండడంతో రైతులకు మూ డేళ్లపాటు ఎకరాకు రూ.30 వేల ఆర్థికసాయం అందించనున్నారు. మొక్కలను కూడా 90శాతం సబ్సిడీపై అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో ఉద్యాన వనశాఖ సంగెం మండలంలోని రామచంద్రాపురం నర్సరీలో మొ క్కలను పెంచుతున్నారు.
9,330 ఎకరాల గుర్తింపు..
జిల్లాలో 12,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా, 9,330 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చారు. రైతుల నుంచి పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్ ప్రతులను సేకరించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. 2022 జూన్‌లో మొదటి దశ, అక్టోబర్‌లో 2వ దఫా రైతులకు మొక్కలను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 3 వేల ఎకరాల్లో సాగు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో రైతులు అధికారులను సంప్రదిస్తున్నారు. మెట్ట భూముల్లో సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో మొక్కకు రూ.111 ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రైతులకు 90 శాతం సబ్సిడీతో రూ.27కే అందించనున్నది.
మొక్కలు సిద్ధం..
ఎంపిక చేసిన రైతులకు ఆయిల్‌పామ్ మొక్కలను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంగెం మండలంలోని లోహిత గ్రామ సమీపంలోని రామచంద్రాపురం వద్ద షేడ్నెట్లతో నర్సరీని ఏర్పాటు చేశారు. మొత్తం 3లక్షల 10వేల మొక్కలు అవసరం కానుండగా, ఇక్కడ దశల వారీగా మొక్కలను పెంచుతున్నారు. మొక్క లు ఏపుగా పెరుగుతుండడంతో వచ్చే జూన్ నుంచి రైతులకు అందించాలని భావిస్తున్నారు. జిల్లా ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలిస్తున్నారు. నర్సరీ నిర్వహణకు ప్రత్యేకంగా ఏఈవోను నియమించారు.
ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు..
పర్వతగిరి మండలంలో ఆయిల్ ఫ్యాక్టరీని ఏ ర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల ఫ్యాక్టరీని ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతోపాటు కంపెనీ ప్రతినిధులు పర్వతగిరికి వచ్చా రు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ కంపెనీ ప్రతినిధులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పంటల సాగు ప్రారంభమైన ఏడాదిలోపే ఫ్యాక్టరీ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎంపిక చేసిన రైతులకు మొక్కలు..;జీ దేవరాజ్, ఆయిల్‌పామ్ అధికారి
దరఖాస్తులు చేసుకున్న రైతులందరికీ అయిల్‌పామ్ మొక్కలను అందిస్తాం. ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చినా అందించేందుకు సిద్ధం. మొక్కలు వేసిన నాలుగో సంవత్సరం నుంచి రైతులకు ఆదాయం మొదలవుతుంది. అందువల్ల ప్రభుత్వం మూడేళ్లపాటు ఆర్థిక సహకారం అందిస్తుంది. సాగుపై సమాచారం కావాలంటే వర్ధన్నపేట, రాయపర్తి మండలాల రైతులు 9000350 126, సంగెం, నర్సంపే ట, దుగ్గొండి, గీసు గొండ రైతులు 9553 148839, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట రైతులు 9502264227, పర్వతగిరి, ఆత్మకూరు మండలాల రైతులు 8464096510 నంబర్లలో సంప్రదించవచ్చు.