పెట్టుబడి సాయం అందుకొని మురుస్తున్న అన్నదాతలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి సబితారెడ్డి
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 29 :ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. బుధవారం రెండు ఎకరాలు, ఆ లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల్లో 1,75,225 మంది రైతులకు రూ. 84.75 కోట్లు, వికారాబాద్ జిల్లాలో1,24,596 మందికి 69.66 కోట్లు అందజేశారు. సమయానికి రైతుబంధు డబ్బులు అందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని మురిసిపోతున్నారు. మరోవైపు రైతుబంధు పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కందుకూరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి సబితారెడ్డి నాయకులు, రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్నో పథకాలు దేశానికే దిక్సూచిగా మారుతున్నాయన్నారు.
రైతు బంధు పథకంలో భాగంగా రెండో రోజు రైతుల ఖాతాలో నేరుగా పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. తొలిరోజు ఎకరాలోపు రైతులకు, రెండో రోజు రెండు ఎకరాలలోపు రైతులకు పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేశారు. మొదటి రోజు 96,142 మంది రైతులకు రూ.28.04కోట్ల రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయగా.. రెండో రోజు 79,083మంది రైతులకు రూ56.71 కోట్ల సాయాన్ని జమ చేసింది. జిల్లాలో రైతు బంధు కింద నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.1966 కోట్ల సాయాన్ని అందజేసింది.
రైతు బంధు, రైతు బీమా దేశానికి దిక్సూచీలు;రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి దిక్సూచీలాంటివని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం కందుకూరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు బంధు పథకంలో భాగంగా రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35.43 లక్షల మంది రైతులకు రూ.1799 కోట్ల సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. రైతు బంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.43,036 కోట్ల సాయాన్ని అందజేసిందని మంత్రి తెలిపారు. యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 66.61 లక్షల మంది రైతులకు రూ.7645.66 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలో ఎక్కడా లేవని, 24 గంటలపాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తు మొదలుకొని విత్తనాలు, ఎరువులు అందిస్తూ.. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టేందుకు పీడీ యాక్ట్ పెట్టి రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు.
రైతుల కోసం అహర్నిశలు కృషి
పరిగి టౌన్, డిసెంబర్ 29 : ఏడో విడుత రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయడంపై స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషిచేస్తున్నారని.. వారికి పంట పెట్టుబడి సాయం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్, నాయకులు మీర్‌మహమూద్‌అలీ, రాజేందర్ పాల్గొన్నారు.
అన్నదాతలకు మంచి రోజులు
పంటలకు పెట్టుబడి సహాయం అందించి రైతుల లాగోడి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం ఎవుసానికి మంచి రోజులు తెచ్చిందని బొంరాస్‌పేటకు చెందిన రైతు అగతి చంద్రయ్య అన్నాడు.
మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉంది?
చంద్రయ్య : నాకు 9 ఎకరాల చెల్క పొలం, రెండు ఎకరాల మాగాణి పొలం ఉంది.
ఎప్పటి నుంచి రైతు బంధు సహాయం అందుతున్నది?
చంద్రయ్య : పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సహాయం అందుతున్నది. ఎకరానికి రూ.5వేల చొప్పున ఏటా రూ.1.10 లక్షల సహాయం అందుతుంది.
రైతు బంధు పథకం నీకు ఎలా ఉపయోగపడింది?
చంద్రయ్య : రైతు బంధుతో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు, పొలం దున్నడానికి ట్రాక్టర్ కిరాయి, లేబర్ కోసం వాడుతున్నాను. ఏటా పెట్టుబడి సాయం వస్తుండడంతో బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడంలేదు. ఇంతకు ముందు లాగోడి డబ్బుల కోసం ఇబ్బందులు పడేవాన్ని. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది.
రైతు బంధుతో ఇంకా ఎలాంటి ప్రయోజనం పొందావు?
చంద్రయ్య : రైతు బంధు రాకముందు లాగోడికి ఇబ్బంది అయి ఆరు ఎకరాల్లో పంటలు సాగు చేసి, మిగతా ఆరు ఎకరాలు బీడుగా ఉంచేవాన్ని. ఇప్పుడు మొత్తం 11 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నా. రెండు బోర్లు వేశాను. పుష్కలంగా నీళ్లు రావడంతో పంటలు బాగా పండుతున్నాయి. పంటలకు మంచి ధరలు కూడా రావడంతో కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చి రెండు నివాస గృహాలు, ప్లాట్లు కొనుగోలు చేశాను.
రైతు బంధుతో అన్నదాతకు భరోసా
రైతు బంధుతో అన్నదాతకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్లలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏడో విడుత రైతు బంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమచేసినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అని రైతులు నిరుత్సాహంగా ఉన్న సమయంలో తెలంగాణ వచ్చిన తరువాత వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో ఏడు విడుతలుగా రైతు బంధును అమలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. రైతుల కోసం మరో ముందడుగు వేసి రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి 5లక్షల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం అందజేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్, సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, లక్ష్మయ్య, వెంకటయ్య, వెంకటయ్యగౌడ్, రాములు, రమేశ్, ఆంజనేయులు, పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దైవ సమానం;మొద్దు అంజిరెడ్డి, ఉత్తమ రైతు
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 29 : రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయమందించి మాలాంటి రైతులకు ముఖ్యమంత్రి దేవుడితో సమానంగా మారాడు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వడంతో ఏటా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసుకుంటున్నాం. అవసరమైతే బోర్లను కూడా పెట్టుబడి సాయం ద్వారానే వేసుకుంటున్నాం.
పెట్టుబడి సాయం ఎలా ఉపయోగపడుతున్నది?
ప్రభుత్వం ఏటా పంట సమయంలో ఇస్తున్న పెట్టుబడి రైతులకెఎంతగానో ఉపయోగపడుతున్నది. పనులు ప్రారంభం కాకముందే సాయం అందడంతో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేస్తున్నాం. పొలాలను దున్నడానికి ట్రాక్టర్లకు కూడా సాయం డబ్బులే చెల్లిస్తున్నాం.
మిగతా రైతులు ఏమంటున్నారు?
రూపాయి పెట్టుబడి లేకుండా రైతులు తమ పంటలను సాగుచేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి రైతులు సాయం డబ్బుతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడంలేదు. రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతాభావంతో ఉన్నారు.
వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి?
అన్నదాతల సంక్షేమానికి రైతు బంధు పూర్తిస్థాయిలో ఉపయోగపడుతున్నది. వ్యవసాయం దండుగ అనుకున్న తరుణంలో సీఎం కేసీఆర్ మళ్లీ ఆశలు పుట్టించారు. గతంలో వ్యవసాయం లేక వలసలు వెళ్లినవారు సైతం నేడు రైతు బంధు ద్వారా మళ్లీ గ్రామాల బాట పట్టారు.
పెట్టుబడి బాధ తీరింది : మంగలి నర్సమ్మ, కంకణాలపల్లి, కోట్‌పల్లి మండలం
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుకు సాయం లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం రైతును పట్టించుకున్న నాయకుడు కూడా కానరాలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు మూడు పంటలు పండించుకునేందుకు వీలుగా రెండు దఫాలుగా ఎకరాకు 5వేల చొప్పున ఏడాదికి 10 వేల రూపాయలను వేయడంతో పెట్టుబడితోపాటు ఉన్న కష్టాలు పోయినాయి. పెట్టుబడి కష్టాలను తొలగించి, బతికే దారిని చూపించిన దేవుడు కేసీఆర్. సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ ఏడాది ఉన్న ఎకరం భూమికి రెండో దఫా కింద 5వేలు వచ్చినవి. నా పొలంలో కంది పంట వేసుకున్న. వచ్చిన మొదటి సాయంతో పురుగు మందు కొన్న. రెండో సాయంతో చిన్న అప్పు తీర్చుకుని సంతోషంగా ఉన్నం.