ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నంలో జిల్లాస్థాయి ఒగ్గు కళాకారుల మహోత్సవం
హాజరైన ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 29 : ఒగ్గు కళాకారుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం శాస్ర్తా గార్డెన్లో రంగారెడ్డి జిల్లాస్థాయి ఒగ్గు కళాకారుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్, కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశ్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అంతరించిపోయిన ఒగ్గు కళాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. కళాకారులెదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో గొల్లకుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పెద్దఎత్తున గొర్రెలను పంపిణీ చేశారన్నారు. ఈ పథకాన్ని అందిపుచ్చుకుని నేడు యాదవకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు.
ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్ మాట్లాడుతూ.. డోలు చప్పుళ్లు, గజ్జెల మోతలంటే సీఎంకు అమితమైన ప్రేమ అని అన్నారు. గొల్లకుర్మలను ఎప్పటికప్పుడు ఆదుకునేందుకు సీఎం కృషిచేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏ ఒక్కరనీ పట్టించుకున్న పాపానపోలేదని, పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకుర్మల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదిగేందుకు అందరూ కలిసిరావాలన్నారు. కార్యక్రమంలో ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శేఖర్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, కుర్మసంఘం నాయకులు కాల్లె గణేశ్, చీరాల రమేశ్, పొట్టి రాములు, కొత్తకుర్మ శివకుమార్, ఐలయ్య, మల్లేశ్, జంగయ్య, ఐలయ్య, జగన్ పాల్గొన్నారు.