
ఎమ్మెల్యే నోముల భగత్
నిడమనూరు, డిసెంబర్ 29 : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెలలో గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తెలిపారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతర్గత రోడ్లు, కాజ్‌వేల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పంచాయతీలను అభివృద్ధి పథంలో నిలపాలని సూచించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదిక సమర్పించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్ మాట్లాడుతూ రెండో విడుత గొర్రెల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియపై గ్రామాల్లో సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే నర్సింహ్మయ్య వెనిగండ్ల గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణానికి మంజూరు చేసిన నిధులను రద్దు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ జయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలు, పథకాలపై సమాచారం ఇవ్వక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ మేగ్యానాయక్ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆర్అండ్బీ ఏఈ శశికుమార్‌పై కూడా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో తాసీల్దార్ ప్రమీల, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, మండల పరిషత్ సలహాదారుడు బొల్లం రవియాదవ్, ఎంపీఓ రామలింగయ్య, పంచాయతీరాజ్, విద్యుత్ ఏఈలు వరలక్ష్మి, పి. వెంకటేశం, ఎంఈఓ బాలునాయక్, ఏఓ మునికృష్ణయ్య, సర్పంచులు కేశ శంకర్, అల్లం శ్రీను, ఎంపీటీసీలు భాస్కరి నాగేంద్ర, కొండ రమాదేవి, మజ్జిగపు లక్ష్మి, విశ్వనాథుల రాణి, సుగుణమ్మ పాల్గొన్నారు.
ఉద్యమకారులపై రౌడీషీట్ ఎత్తివేయాలని హోం మంత్రికి ఎమ్మెల్యే వినతి
హాలియా : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఉద్యమ కారులపై అప్పటి ప్రభుత్వం పెట్టిన రౌడీషీట్ కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన హోం మంత్రి ఉద్యమకారులపై రౌడీషీట్లను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.