
దామరచర్ల, డిసెంబర్ 29;పితృదేవతల సంతర్పణ స్థలిగా వాడపల్లి మరో గయ, ప్రయాగ క్షేత్రంగా పేరు గాంచింది. కృష్ణా, మూసీ నదుల పవిత్ర సంగమ తీరంలో కృతయుగంలో నాటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివకేశవ ఆలయాల పవిత్ర స్థలం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి పుణ్యక్షేత్రం. కృష్ణా, ముచికుంద (మూసీ) నదుల సంగమం పుణ్య స్నానాలతోపాటు చివరి మజిలీ అనంతరం కొనసాగే కార్యక్రమాలకు నిలయంగా మారింది. కాశీ, గయ, ప్రయాగకు దీటుగా వాడపల్లి అలరారుతున్నది. హైదరాబాద్కు 170 కిలోమీటర్లు, నల్లగొండ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట అనుకూలంగా ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.
పవిత్ర స్థలం.. కృష్ణా, ముచికుంద సంగమం
కృతయుగంలో అగస్త్యుడు అన్నపూర్ణ కావడిలో శివకేశవులను దక్షిణ మండలంలో ప్రతిష్ఠించాలని బయలు దేరి దేవతామూర్తుల అభీష్టం మేరకు కృష్ణా, మూసీ నదుల సంగమం తీరంలో మీనాక్షీ అగస్తేశ్వరస్వామి, లక్ష్మీ నర్సింహస్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అగస్త్యుడు పార్వతీ పరమేశ్వరులను ప్రతిష్ఠించడంతో నాటి నుంచి మీనాక్షీ అగస్తేశ్వరస్వామిగా ఈ క్షేత్రం విరజిల్లుతున్నది. నాటి మునులు తపస్సు ఆచరించి దేవతామూర్తుల అనుగ్రహం పొందిన ఈ క్షేత్రం కొంత కాలానికి కాలగర్భంలో కలిసిపోయింది. రెడ్డి రాజుల కాలంలో తవ్వకాలు జరుపుతుండగా దేవతామూర్తులు బయట పడడంతో రాజులు ఆలయాలను నిర్మించి పునఃప్రతిష్ఠించారు. నాటి నుంచి ఈ ప్రాంతం పౌరాణిక ప్రాశస్త్యంతో భక్తుల మనోభావాలకు, అనాధిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల నిలయంగా మారింది. శివరాత్రి, కార్తీకమాసం, తొలి ఏకాదశి పర్వదినాలతోపాటు నిత్యం భక్తుల పూజా కార్యక్రమాలతో కళకళలాడుతున్నది.
పితృదేవతల అనుగ్రహ పూజలు..
వైధిక మార్గం, రుషిమార్గాన్ని అనుసరించి పితృదేవతల ఆత్మలు ఇహలోకం నుంచి స్వర్గలోక ప్రాప్తి పొందడానికి పలు రకాల పూజలను నిర్వహిస్తారు. అందులో భాగంగానే కృష్ణా, ముచికుంద నదుల సంగమ తీరంలో పరమేశ్వర నిలయం ఉండడంతో భక్తులు అధికంగా ఈ ప్రాంతంలోనే పితృదేవతల అనుగ్రహ పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రా ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడకు విచ్చేసి పితృ తర్పణాలు, అస్తి సంచయనం, ఆబ్ధికం, తద్దినాలు, పిండ ప్రదానాలు చేస్తున్నారు. ఇక పితృదేవతల అనుగ్రహం పొందే భద్రపద మాసం కృష్ణ పక్షంలో వచ్చే పితృపక్షం పదిహేను రోజులు, మహాలయ అమావాస్య, ఏకాదశి, అమావాస్య తిథులలో అధికంగా పితృదేవతల పూజలు నిర్వహిస్తారు. గతంలో ఈ ప్రాంతంలో అంతగా పూజలు జరిగేవి కావు. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాలకు లక్షలాది మంది విచ్చేసి తమ పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలారు. నాటి నుంచి ఈ ప్రాంతం అధికంగా ప్రాచుర్యం పొందింది.
పవిత్ర స్థలం వాడపల్లి
ఈ ప్రాంతం పౌరాణిక ప్రాశస్త్యం కావడంతో భక్తులు అధికంగా పూజలు నిర్వహిస్తుంటారు. పుణ్య కార్యక్రమాలతోపాటు పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరిచి వారి అనుగ్రహం పొందేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శివాలయం ఉండడంతోపాటు కృష్ణా, ముచికుంద నదుల సంగమం కావడంతో ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. రెండు నదుల సంగమం తీరంలో పితృదేవతల పూజలు నిర్వహించి సంగమంలో పిండ ప్రదానాలు, అస్తి సంచయనం చేస్తుంటారు.
భక్తులకు అన్ని రకాల సదుపాయాలు
సుదూర ప్రాంతాల నుంచి వాడపల్లికి వచ్చే వారికి అన్ని రకాల సదుపాయలు, సౌకర్యాలు లభిస్తాయి. నిత్యం పదిమంది పూజారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు. పూజ అనంతరం అస్తి సంచయనం, పిండ ప్రదానాలు సంగమంలో సంచయనం చేసేందుకు మర పడవలు అందుబాటులో ఉంటాయి. భక్తులకు ఈ ప్రాంతం అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటంతో నిత్యం పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి.