
ఆరెకరాల్లో పంట.. ఏడాదికి రూ.22లక్షల ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు గణేశ్
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతర పంటల వైపు మొగ్గు
బొమ్మలరామారం, డిసెంబర్ 29 ;వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇదే ప్రోత్సాహంతో మిర్చి సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సుక్క గణేశ్ ముదిరాజ్. సొంతంగా ప్యాకింగ్ పరిశ్రమ నడుపుతున్నప్పటికీ వ్యవసాయంపై మక్కువతో మిర్చి, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు.
మేడిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సుక్క గణేశ్ ముదిరాజ్‌కు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 2ఎకరాల్లో వరి, 6 ఎకరాల్లో మిర్చి, మిగతా 2 ఎకరాల్లో పశుగ్రాసం, కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు.
ఎడాదికి రూ.22లక్షల ఆదాయం
మిర్చి నారుపోసిన 60 రోజుల తరువాత కాతకు వస్తుంది. కొద్ది రోజుల వ్యవధిలో మూడు సార్లు పంటను కోస్తారు. సంవత్సరానికి రెండు పంటలను పండిస్తాడు గణేశ్. ఎకరా మిర్చిపంట సాగుకు సుమారుగా రూ.లక్షా 10వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. పంట బాగా పండితే ఎకరాలకు 40 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక పోయినా ఎకరాకు 25 క్వింటాళ్ల అయినా పండుతుంది. మార్కెట్లో తేజ రకం మిర్చికి తక్కువలో తక్కువ క్వింటాకు రూ.14వేల నుంచి 15వేల వరకు ధర పలుకుతుందని, ఆరు ఎకరాల్లో 150 కింటాళ్ల మిర్చికి రూ.22లక్షల వరకు చేతికి వస్తాయని చెబుతున్నాడు గణేశ్. సాగు ఖర్చులు పోను నికరంగా రూ.11లక్షల ఆదాయం వస్తుందని, సంవత్సరానికి రెండు పంటలు వేస్తుండంతో రూ.22 లక్షల వరకు లాభాలు వస్తున్నాయని పేర్కొన్నాడు.
మార్కెట్ ధర బాగుంది
తేజ మిర్చికి మార్కెట్లో సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. రంగుల తయారీలో కూడా మిర్చిని వాడుతారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం కల్పించాలి. రైతులు ఇతర పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందేలా చూడాలి.