
బ్యాంకుల్లో రైతు బంధు నగదు జమ
రెండోరోజు 2.56 లక్షల మందికి రూ.187.55 కోట్లు
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు
సూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు సాయం కొనసాగుతుండడంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలకు టీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు పథకంతో ప్రతి రైతుకూ పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడని పేర్కొన్నారు. నగదు విడుదల సందర్భంగా పలు ప్రాంతాల్లో రైతులను పలుకరించగా ‘సీజన్ ప్రారంభంలోనే అందించిన పంట పెట్టుబడి సాయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని, సీఎం మేలు మర్చిపోలేమని అన్నారు. తొలి రోజు మంగళవారం ఎకరం లోపు రైతులకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2.54 లక్షల మందికి రూ.79.81 కోట్లు జమ కాగా రెండో రోజు రెండు ఎకరాల్లోపు 2.56 లక్షల మంది ఖాతాల్లో రూ.187.55 కోట్లు జమయ్యాయి. ఉమ్మడి జిల్లా వారీగా పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాలో 73,389 మంది రైతులకు రూ.53,88,43,444, నల్లగొండ జిల్లాలో 1,25,446మంది రైతులకు రూ.92,68,80,236, యాదాద్రి జిల్లాలో 56,709 మంది రైతులకు రూ.40,97,25,272 జమయ్యాయి. రెండ్రోజుల్లో మొత్తం 5.11 లక్షల మంది రైతుల అక్కౌంట్లలోకి రూ.267.36కోట్లు జమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కనీసం పట్టించుకున్న నాథుడే లేకపోగా రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సాగు నీరు, విద్యుత్ నిరంతరాయంగా అందిస్తూ పండుగలా మార్చారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతున్నాయి. రైతు బంధు నగదు పది రోజుల్లో రైతులందరికీ అందనున్నది.