
యాదాద్రి, డిసెంబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్లవారుజాము 4నుంచి 5.30గంటల వరకు గిరిప్రదక్షిణలో వందలాది భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో రెండు గంటల పాటు శ్రీవారి అష్టోత్తర శతఘటాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. నారసింహుడి జన్మనక్షత్రం సందర్భంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టి ఆరాధించారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అనంతరం తులసీ పత్రాలతో అర్చించారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేపట్టారు. బాలాలయంలోని మహామండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్యతిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బాలాలయం, పాతగుట్ట ఆలయంలో తిరుప్పావై వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలను పటిస్తూ గోదాదేవి రచించిన తొమ్మిదో పాశురాలను పఠించి భక్తులకు వినిపించారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ.12,41,124 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.