
కార్తిక వన సమారాధనలో చిన జీయర్ స్వామి
అమీర్‌పేట్, నవంబర్ 28 : వైదిక ధర్మాన్ని పరిరక్షించడంలో తమ పిల్లలు భాగస్వాములయ్యేలా చూడాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం సనత్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో కార్తిక వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరై ప్రసంగించారు. ప్రతి బ్రాహ్మణుడు తమ కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తినైనా వైదిక ఆచారాలు పాటించే వారిగా తీర్చిదిద్దుతామనే ప్రతిజ్ఞబూనాలన్నారు. భారతీయులపై పాశ్చాత్య ప్రభావం బాగా పడిందని, తమ కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలకు దూరమవుతున్నారన్నారు. దీంతో వారసత్వ సంప్రదాయాలను ముందు తరానికి అందించలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించేందుకు సరిహద్దుల్లో సైనికులు శస్త్రధారులై ఉంటుంటే.. దేశంలోని ప్రజానీకాన్ని, పాలకులను కాపాడేందుకు బ్రాహ్మణులు శాస్త్రధారులై ఉంటారన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ ఎం.రామచంద్రరావు, బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ప్రతినిధులు జి.విజయలక్ష్మి, పంచ గంగేశ్వర్, ఎంవీ.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.