క్వింటాల్‌కు రూ.2620
ఇప్పటి వరకు 28వేల క్వింటాళ్ల సేకరణ
బోథ్, జూన్ 28: జొన్న సాగు చేసిన రైతుకు మద్దతు ధర దక్కింది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తుండడంతో పూర్తి ధర వస్తున్నది. మండలంలో యాసంగి కింద 3950 ఎకరాల్లో రైతులు జొన్న పంటను సాగు చేశారు. ప్రభుత్వం మక్క వేయకుండా ఇతర పంటలు సాగు చేయాలని సూచించడంతో జొన్న సాగు వైపు అన్నదాతలు మొగ్గు చూపారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో జొన్నలు ఎక్కువగా వినియోగించే ఉత్తరాది రాష్ర్టాల మార్కెట్లలో ధర లేకపోవడంతో ఇక్కడ క్వింటాల్‌కు రూ.1000 నుంచి 1200 పలకడంతో రైతులు ఆందోళన చెందారు. ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, జోగు రామన్న కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ద్వారా జొన్నల కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. రైతుల వద్ద ఉన్న జొన్నలను మద్దతు ధర రూ.2620 కల్పిస్తూ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం వెంటనే జొన్నల కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బోథ్‌లో మార్క్‌ఫెడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 27 వరకు 1227 మంది రైతులకు చెందిన 28,418 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. జొన్నలు కొనుగోలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.