
చిన్నారులకు అత్యాధునిక వైద్యం మరింత చేరువ
సూర్యాపేట జనరల్ దవాఖానలో నవజాత శిశు చికిత్స కేంద్రం
రూ.35లక్షల వ్యయంతో 20 పడకల ఎస్ఎన్సీయూ ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట టౌన్, జనవరి 28;ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇప్పటికే సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలతో ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చి డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో ప్రజలకు మెరుగైన వైద్యం చేరువైంది. సూర్యాపేట జిల్ల్లా కేంద్ర దవాఖానలో ప్రస్తుతం తల్లీబిడ్డల కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రం నడుస్తుండగా నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా శిశు సంజీవని ఏర్పాటు చేశారు. రూ.35 లక్షలతో 20 పడకలు సిద్ధం చేయగా శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తక్కువ బరువు, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు శిశు సంజీవని ఎంతో ఉపయోగపడనున్నది.
స్వరాష్ట్రంలో కొత్త జిల్లాగా ఆవిర్భవించిన సూర్యాపేట దినదినాభివృద్ధి చెందుతున్నది. నవ నిర్మాణాలతో జిల్లా కేంద్రం నలుమూలలా శరవేగంగా మార్పు చెందుతూనే మెరుగైన సౌకర్యాలు సమకూర్చుకుంటున్నది. విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో ప్రగతిని చాటుతున్నది. గతంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మెడికల్ కళాశాలను మంజూరు చేయించి మెరుగైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా జిల్లా జనరల్ దవాఖానలో పడకల సంఖ్యను పెంచి తల్లీబిడ్డలకు ప్రత్యేక వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా మాతాశిశు (ఎంసీహెచ్) కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఎటువంటి వైద్య సేవలకైనా దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సకల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
గతేడాది కొవిడ్ విజృంభించిన తరుణంలో జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రత్యేక వార్డులను, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి కొండంత అండగా నిలిచారు. ఆక్సిజన్ కొరత రాకుండా ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచారు. ఇలా అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి కార్పొరేట్‌ను తలదన్నేలా జనరల్ దవాఖానను తీర్చిదిద్దారు.
రూ.35లక్షలతో 20 పడకలతో ఎస్ఎన్సీయూ ఏర్పాటు…
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గల మాతాశిశు (ఎంసీహెచ్) కేంద్రంలో సుమారు రూ.35 లక్షల వ్యయంతో 20 పడకల ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రం (ఎస్ఎన్సీయూ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నవజాత శిశు మరణాలను సూర్యాపేటలో పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలో ఈ కేంద్రం ఏర్పాటైంది. ఇప్పటి వరకు తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు పూర్తి ఆరోగ్యం కోసం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎన్సీయూ ఏర్పాటుతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ, పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ప్రయోజనం చేకూరనుంది.
నేడు ప్రారంభించనున్న మంత్రులు…
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన 20 పడకల ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం శుక్రవారం రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
తక్కువ బరువుతో పుట్టిన, నెలలు నిండని శిశువులకు మెరుగైన చికిత్స కోసం గతంలో హైదరాబాద్‌కు రెఫర్ చేసేవాళ్లం. నిరుపేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు గమనించి నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా జనరల్ దవాఖానలో ఎస్ఎన్సీయూ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దాంతో మాతా శిశు కేంద్రంలో 20 పడకల ప్రత్యేక నవజాత శిశువుల కేంద్రం సిద్ధమైంది. నిపుణులైన ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలకు అవసరమైన పూర్తి మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
ఉమ్మడి జిల్లా నల్లగొండ వ్యాప్తంగా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతాభివందనాలు. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మార్చి సంచలనాత్మకంగా మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా నవజాత శిశువుల ప్రాణాలు నిలిపేందుకు ప్రత్యేక ఎస్ఎన్సీయూ ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలకు వరం. మెడికల్ కళాశాల అనుబంధ దవాఖానలో పనిచేయడానికి వచ్చిన సుమారు 120 మంది స్టాఫ్ నర్సులకు అవసరమైన తాత్కాలిక సదుపాయాలను వెంటనే కల్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.