
జన జాతరగా సైదన్న ఉర్సు
రెండో రోజు ఘనంగా గంధోత్సవం
లక్షకుపైగా తరలివచ్చిన భక్తులు
పాలకవీడు, జనవరి 28 : జాన్‌పహాడ్ సైదన్న ఉర్సు వైభవంగా సాగుతున్నది. రెండో రోజు శుక్రవారం గంధోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి, దర్గా ముజావర్ ఇంటి నుంచి తీసుకొచ్చిన గంధాన్ని పకీర్ల ఖవ్వాలీ, విన్యాసాల మధ్య గుర్రాలపై ఊరేగించగా అందుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. తెలుగు రాష్ర్టాల నుంచి లక్షకుపైగా భక్తులు రావడంతో దర్గా పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి.
మత సామరస్యానికి ప్రతీకైన జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో రెండోరోజు శుక్రవారం ప్రధానమైన గంధోత్సవం(ఉర్సే షరీఫ్) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఉర్సు ఉత్సవం జనజాతరగా మారింది. సుమారు లక్షమంది సైదుల్ బాబాను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తెచ్చిన గంధాన్ని ఫకీర్ల ఖవ్వాలీ, మేళతాళాలతో జాన్‌పహాడ్ దర్గా గ్రామంలో గల చందల్ఖానాలోని కలశాలలో ఉంచారు. మరోవైపు దర్గా పూజారి సయ్యద్జాని ఇంటి నుంచి గుర్రాలపై తెచ్చిన గంధాన్ని చందల్ఖానాలోని గంధంతో కలిపారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి సమక్షంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గంధాన్ని ఎత్తుకుని ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ రఘు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నడుమ కల్మటి తండా, జాన్‌పహాడ్ గ్రామాల్లో 5గంటల పాటు గం ధం ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు గంధం అందుకోవడానికి ఒక్కసారిగా ఎగబడడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్షా, జాన్‌పాక్ సయ్యద్ రహమతుల్లా సమాధులపైకి గంధం ఎక్కించారు. అంతకుముందు ఎమ్మెల్యే సైదిరెడ్డికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
ఉర్సు ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో దర్గా పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తులు సఫాయి బావి వద్ద స్నానాలు ఆచరించి దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సైదులు బాబా దర్శనానికి భక్తులు గంటల కొద్ది క్యూలో వేచి ఉన్నారు. రద్దీని నియంత్రించడానికి అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమబద్ధంగా దర్శనాలు చేయించారు. మహిళలు దర్గా ఆవరణలోని నాగేంద్రుడి పుట్ట వద్ద పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున కందూరు నిర్వహించడంతో పాటు, తలనీలాలు సమర్పించారు. ఉత్సవానికి ఆంధ్రాలోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు నుంచి భక్తులు తరలివచ్చారు. తాత్కాలికంగా వెలసిన దుకాణాల్లో పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగాయి.
పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు
డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 300మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తుల వాహనాలు, ఆర్టీసీ బస్సులను పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపివేశారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక శిబిరాలు 50మంది సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు వైద్యసేవలు అందించారు. రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులు నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు తీసుకున్నారు. దర్గా పరిసరాల్లో ఇబ్బంది లేకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచారు. కోదాడ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోల నుంచి 30బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను చేరవేశారు.
డెక్కన్ యాజమాన్యం , స్వచ్ఛంద సంస్థల వితరణ
ఉర్సుకు వచ్చిన భక్తులకు డెక్కన్ యాజమాన్యం తాగునీరు అందించింది. ఓజో ఫౌండేషన్ 10వేలకు పైగా మాస్కులు, శానిటైజర్లు, జేపీఎస్ మెడికల్ దుకాణ యాజమాన్యం 5వేల మాస్కులు భక్తులకు పంపిణీ చేశారు. రాంబాబు డిజిటల్స్ ఫొటో స్టూడియో ఆధ్వర్యంలో 5వేల మాస్కులు, మంచినీరు, అల్పాహారం సమకూర్చారు.
హాజరైన ప్రముఖులు
ఉర్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన వారిలో రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ అడావత్ శరత్, అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీపీఓ యాదయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మలమంటి దర్గారావు, పీఏస్సీఎస్ చైర్మన్ ఎరడ్ల సత్యనారాయణరెడ్డి, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు చందమళ్ల జయబాబు, శ్రీలతారెడ్డి, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, డీసీసీబీ ్ల డైరెక్టర్ అప్పిరెడ్డి, నేరేడుచర్ల టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సురేశ్, ముజావర్ జాని, దర్గా గ్రామ సర్పంచ్ రూపావత్ గోరి, పాలకవీడు ఇన్చార్జి తాసీల్దార్ రాంరెడ్డి, నేరేడుచర్ల తాసీల్దార్ సరిత, ఎంపీడీఓ జానయ్య, సీఐ రామలింగారెడ్డి, పాలకవీడు, నేరేడుచర్ల ఎస్ఐలు సైదులు, నవీన్‌చారి, డెక్కన్ ఫ్యాక్టరీ జీఎం నాగమల్లేశ్వర్రావు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్, టీఆర్ఎస్ నాయకులు సురేశ్, సైదయ్య, వెంకటీ, రాజశేఖర్, వెంకట్‌రెడ్డి, సైదులు, అశోక్‌నాయక్, భూక్యా రవి పాల్గొన్నారు.