
ఎమ్మెల్సీ ఎల్.రమణ
భుదాన్పోచంపల్లి నుంచి లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభం
బీబీనగర్ ( భూదాన్ పోచంపల్లి ), జనవరి 28 : చేనేత వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. అఖిల భారత పద్మశాలీ సంఘం పిలుపు మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భుదాన్పోచంపల్లిలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నూలుతో తయారయ్యే వస్ర్తాలపై చరిత్రలో ఏ ప్రభుత్వం పన్నులు వేసే సాహసం చేయలేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వస్ర్తాలపై ఐదు శాతం జీఎస్టీ విధించి దాన్ని 12 శాతానికి పెంచేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఎట్టి పరిస్తుతుల్లో పెంపును అంగీకరించేది లేదని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జీఎస్టీని రద్దు చేసేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. చేనేత వస్ర్తాలను తయారు చేస్తున్న నేతన్నలను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని, వస్ర్తాలపై జీరో జీఎస్టీ విధించేలాదాకా లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం చైర్మన్ యర్రమాద వెంకన్న, అధ్యక్షుడు శ్రీధర్ సుంకార్వార్, ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబూరావు, టై అండ్ డై అధ్యక్షుడు రమేశ్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.