
తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి మొదలు
పది రోజుల్లో అందరి ఖాతాల్లో నగదు
నల్లగొండలో 4.93 లక్షల మంది లబ్ధిదారులు
సూర్యాపేటలో 2.70 లక్షల మంది..
వానకాలంతో పోలిస్తే అదనంగా 24.361 మంది
ఈ నెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో వెన్నువిరిగిన రైతన్నను తిరిగి నిలబెట్టడంలో కీలకంగా ఉంటూ వస్తున్న పథకం రైతు బంధు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టి, అన్నదాతకు పంట పెట్టుబడి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎనిమిదో విడుతకు సిద్ధమైంది. సీజన్ ఆరంభంలో రైతులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమకు నిర్ణయించింది. ఈ యాసంగిలో నల్లగొండ జిల్లాలో 4.93లక్షల మంది రైతులకు రూ.616.21 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2.70లక్షల మంది రైతులకు రూ.314 కోట్లు అందించనున్నది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి అదనంగా 24,361 మంది రైతులకు కొత్తగా లబ్ధి చేకూరనున్నది. ఈ నెల 30 వరకు పట్టాదారు పాసుపుస్తకం పొందిన ప్రతి రైతుకూ దరఖాస్తుకు అవకాశం కల్పించింది. వ్యవసాయానికి దన్నుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చిత్తశుద్ధికి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. తొలుత ఎకరంలోపు విస్తీర్ణం కలిగిన రైతులతో పంపిణీ ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం సీజన్ ఆరంభంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నది. దాంతో రైతులు ఎంతో ఆత్మవిశ్వాసంతో పంటల సాగును ఆరంభిస్తున్నారు. రైతుబంధు పథకం అమలుతో వేలాది ఎకరాల బీడు భూములు సైతం సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో స్వరాష్ట్రంలో అదనంగా 8.50 లక్షల ఎకరాలు సాగులోకి రావడంలోనూ రైతుబంధు పథకానిది కీలకపాత్ర. 2018 వానకాలంలో ఎకరానికి నాలుగు వేల చొప్పున తరవాత 5వేల చొప్పున రెండు సీజన్లలో అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ నగదు జమయ్యేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. సీజన్ల వారీగా కొత్తగా పాసుపుస్తకాలు పొందిన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నారు. పాస్ పుస్తకాలు ఉండి దరఖాస్తు చేసుకోని రైతులు ఉంటే వ్యవసాయ అధికారులు వెంటబడి మరీ పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ సారి కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. ధరణి అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఈ ఒక్క సీజన్లోనే రైతుల సంఖ్య భారీగా పెరిగింది కూడా. దీంతో ఈ సీజన్లో రైతులకు అందించనున్న పెట్టుబడి సాయం మరింత పెరుగనుంది.
నల్లగొండ జిల్లాలో 4.93లక్షల మంది
రాష్ట్రంలోనే రైతుబంధు ద్వారా అత్యధిక ప్రయోజనం పొందే జిల్లా నల్లగొండనే. ఈ యాసంగిలోనూ అత్యధికంగా నల్లగొండ జిల్లాలో మొత్తం 4,93,146మంది రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులుగా వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. ఇందుకోసం రూ. 616.12 కోట్లు అందజేయనున్నారు. ఈ ఏడాది వానకాలంతో పోలిస్తే 16,419 మంది రైతులు అదనంగా పెరిగారు. మిగిలిన ఈ మూడ్రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటివరకు 4,65,111 మంది రైతుల వివరాలను వ్యవసాయశాఖ అప్డేట్ చేయగా 3.26లక్షల మంది రైతుల వివరాలను ట్రెజరీకి పంపించారు. ఇవి క్లియర్ చేస్తూనే మిగతా రైతుల వివరాలను ఎప్పటికప్పుడూ అప్లోడ్ చేయనున్నారు. అయితే కొత్తగా పాస్‌పుస్తకాలు అందుకున్న వారిలో 9వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా మరో 4వేల మందికి బ్యాంకు ఖాతాలతో ఇబ్బందులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరంతా ఈ నెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 2.70లక్షల మంది
సూర్యాపేట జిల్లాలో యాసంగి సీజన్‌కు మొత్తం 2,70,853 మందిని అర్హులుగా వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. వీరికి ఎకరానికి 5వేల చొప్పున మొత్తం రూ. 314కోట్ల పెట్టుబడి సాయంగా అందించాలని అంచనా వేశారు. ఈ జిల్లాలోనూ వానకాలం సీజన్‌తో పోలిస్తే 7942 మంది అదనంగా పథకానికి అర్హులుగా ఉన్నారు. వానకాలంలో ఈ జిల్లాలో 262911 మంది అర్హులుగా గుర్తించి పెట్టుబడి సాయం అందించారు. కొత్తగా పాస్‌పుస్తకాలు పెరుగడంతో ఈ సారి అర్హులైన రైతుల సంఖ్య కూడా పెరిగింది. వానాకాలంలో సుమారు 11వేల మంది రైతులు వివిధ కారణాలతో వివరాలు అందజేయలేదు. వారూ పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతీ రైతు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పదేపదే ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.