
మెదక్ జిల్లా కొత్త ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి
ఫిర్యాదులు 8332911100 వాట్సాప్ నంబర్‌కు చేయాలని సూచన
సిద్దిపేట సీపీగా బాధ్యతలు చేపట్టిన శ్వేత
అభినందనలు తెలిపిన పోలీస్ అధికారులు
మెదక్, డిసెంబర్ 26 : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని, ఈ విషయంలో పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని మెదక్ జిల్లా కొత్త ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఆదివారం మెదక్‌లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రోహిణి ప్రియదర్శిని ఇంతకు ముందు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హూనూర్ సబ్ డివిజన్లో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్రాష్ట్ర క్యాడర్ బదిలీల్లో భాగంగా 2016లో తెలంగాణకు వచ్చారు. వనపర్తి జిల్లా ఎస్పీగా, ఆ తర్వాత సైబరాబాద్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆదివారం మెదక్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పోలీసు శాఖలో ఉద్యోగం రావడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమన్నారు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం పోలీసు ఉద్యోగం కల్పిస్తున్నదని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ నంబర్ 833291 1100కి మెసేజ్ చేయవచ్చని ఆమె సూచించారు. అక్రమార్కులు, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించమని ఆమె హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీ బి.బాలస్వామి, తూప్రాన్ డిఎస్పీ కిరణ్‌కుమార్, మెదక్ డిఎస్పీ సైదులు, జిల్లాలోని సీఐలు, డిపీవో సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
బాధ్యతలు స్వీకరించిన శ్వేత..
సిద్దిపేట టౌన్, డిసెంబర్ 26 : సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా ఎన్.శ్వేత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్‌లోని అన్ని విభాగాలను ఆమె సందర్శించారు. అంతకు ముందు అడిషినల్ డీసీపీ శ్రీనివాసులు, ఏఆర్ అడిషినల్ డీసీపీలు రాంచందర్‌రావు, సుభాష్‌చంద్రబోష్, ఏసీపీలు దేవారెడ్డి, రమేశ్, సతీశ్, పోలీసు అధికారులు, సిబ్బంది, సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.