
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు
గులాబీ గూటికి చేరిన బీజేపీ నాయకులు
బాలానగర్, డిసెంబర్ 26 : ప్రజాసంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం వైస్‌ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీ పటిష్టతకు పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు ఉంటుందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకుడు లక్ష్మణ్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, శివ, రమేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.