
లొంగిపోయినవారు మావోయిస్టు నేత ఆజాద్‌కు గార్డులు
వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్
కొత్తగూడెం క్రైం, జూన్ 26 : మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, దళ నాయకులు, సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై నిర్లక్ష్యం వహిస్తున్న అగ్రనేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు, సభ్యులు లొంగు‘బాట’పడుతున్నారని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టు దంపతులు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయిన సందర్భంగా ఎస్పీ సునీల్‌దత్ శనివారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మణుగూరు ఏరియా కమిటీ ఎల్వోఎస్ కమిటీ సభ్యుడు మడివి ఇడుమ అలియస్ సురేందర్ ఆయన భార్య దళసభ్యురాలు మడకం బుద్రి అలియాస్ సోనీలు పోలీసుల ఎదుటు లొంగిపోయినట్లు తెలిపారు. మడివి ఇడుమ నిషేధిత మావోయిస్టు పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడని, ప్రస్తుతం ఇడుమ ఆ పార్టీ స్టేట్ కమిటీ సభ్యుడిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజనల్ కార్యదర్శి ఆజాద్‌కు గార్డుగా పని చేసినట్లు తెలిపారు. ఇడుమ 2018వ సంవ్సరం నుంచి మావోయిస్టు పార్టీలో పని చేస్తూ అనేక విధ్వంసక చర్యలో పాల్గొన్నట్లు తెలిపారు. బుద్రి మణుగూరు ఎల్వోఎస్ సభ్యురాలిగా, ఆజాద్ గార్డుగా పనిచేసినట్లు తెలిపారు. బుద్రి 2016 నుంచి మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నట్లు వివరించారు.
వీరిరువురు మావోయిస్టు అగ్రనాయకత్వం వేధింపులు, మావోయిస్టు పార్టీలోని నాయకులు, సభ్యులకు కరోనా సోకడంతో భయాందోళనకు గురై స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, టెక్ టీమ్ ఇన్చార్జి సోబ్రాయి, గంగు, ప్రకాశ్, భారతక్క కరోనా వైరస్ సోకి మరణించడంతో మావోయిస్టు పార్టీలోని నాయకులు, సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టు పార్టీ అదినాయకత్వానికి కిందిస్థాయి నాయకులు, సభ్యులపై సానుభూతి లేకపోవడ, వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడంతో వారు లొంగుబాట పడుతున్నారన్నారు. కరోనా లేదా ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నా మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యుడు పోలీసులకు లొంగిపోతే వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎస్పీ సునీల్ దత్ హామీ ఇచ్చారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు పోలీస్‌శాఖ తరుఫున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) వుప్పు తిరుపతి, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, భద్రాచలం ఏఎస్పీ వినీత్ కుమార్, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్ పాల్గొన్నారు.