నేడు సర్వేల్ గురుకులం గోల్డెన్
జూబ్లీ వేడుకలు దేశంలోనే మొట్టమొదటి గురుకులం
ఎందరో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను అందించిన విద్యాలయం
సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 25;ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన సర్వేల్ గురుకులం 50 వసంతాలు పూర్తి చేసుకుని ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. నేడు దేశమంతా గురుకులాల వైపు చూస్తుందంటే.. దానికి బీజాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50 ఏండ్ల క్రితమే పడ్డాయి. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో 1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ విద్యాలయం దేశ వ్యాప్తంగా గురుకుల వ్యవస్థకే ప్రాణం పోసింది.
సర్వేల్ గ్రామానికి చెందిన సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి కోల్‌కతాలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేసిన శాంతినికేతన్ విద్యాలయాన్ని ఒకసారి సందర్శించారు. ఆ సమయంలో తన గ్రామంలో గురుకులాన్ని స్థాపించాలనుకున్నారు. తన ఆలోచనను అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుతో పంచుకున్నారు. అప్పటికే గీతాంజలి మాదిరిగా రాష్ట్రంలో ఓ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పీవీ నరసింహారావు ఉన్నారు. దాంతో మద్ది నారాయణరెడ్డి ఆలోచన స్ఫూర్తిదాయకంగా అనిపించి సర్వేల్ గురుకుల పాఠశాలకు బీజం వేశారు. గురుకుల పాఠశాల కోసం మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల భూమిని ఇచ్చారు. 1971 నవంబర్ 23న పీవీ నరసింహారావు గురుకుల పాఠశాలను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ గురుకుల విద్యాలయానికి అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ ఆదినారాయణశాస్త్రి మొదటి ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ఆ తరువాత 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తాటికొండ, రాయలసీమ ప్రాంతంలోని కొడిహనహళ్లిలో గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు.
సర్వేల్ గురుకుల పాఠశాల అతి తక్కువ సమయంలోనే ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచింది. దీని ఫలితాలు దిశలా వ్యాపించి ఎన్నో ఆధునిక గురుకులాల ఏర్పాటుకు దోహదపడింది. సర్వేల్ గురుకులం క్రమశిక్షణకు పెట్టింది పేరు. విద్యార్థులు ఉదయం మేల్కొనగానే వారితో వ్యాయామం చేయిస్తారు. ఉదయం 7:30కు ప్రార్థన అనంతరం అల్పాహారంగా పాలు, పండ్లు అందిస్తారు. ఆ తర్వాత విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. మధ్యాహ్న భోజనం అనంతరం మళ్లీ తరగతులు ఉంటాయి. సాయంత్రం 4:30కు స్టడీ హవర్, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రెండు గంటలపాటు స్టడీ హవర్ ఉంటుంది. క్రీడలు, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చదువుతోపాటు నైతిక విలువలు, అంకితభావం, నిబద్ధత వంటి సుగుణాలను నేర్పుతున్నారు. నాయకత్వ లక్షణాలతోపాటు క్రీడల్లో తర్ఫీదుఇస్తారు. దాంతో ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించారు. ఇప్పటి వరకు 37 బ్యాచ్‌ల విద్యార్థులు ఇక్కడ చదువు పూర్తి చేసుకున్నారు. 1996లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సర్వేల్ గురుకులం ఉత్తమ గురుకుల విద్యాలయం అవార్డు అందుకున్నది.
ఉన్నత స్థానాల్లో గురుకుల విద్యార్థులు..
సర్వేల్ గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు 3,500 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. వారిలో 40 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్‌లో ఎంపికై దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. 500 మంది వరకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ తదితర దేశాల్లో ఉన్నత స్థితిలో స్థిరపడ్డారు. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, రాజకీయంగా ఎదిగిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు లెక్కకు మించి ఉన్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశం, గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, డీఐజీ ప్రభాకర్‌రావు, వరంగల్ ఈస్ట్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా కొనసాగుతున్న దినకర్‌బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ సొసైటీ ఎండీ మల్లారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఐఏఎస్ డాక్టర్ శశిధర్, దివంగత ఎల్.వెంకట్‌రెడ్డి, ఐఆర్టీఎస్ లక్ష్మీనారాయణ, ఐఆర్ఎస్ డి.ప్రభాకర్‌రెడ్డి, అంజన్‌కుమార్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సి.రమేశ్, డాక్టర్ పెద్ది శ్రీధర్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లింగారెడ్డి (నవజాత శిశువుల నిపుణులు), డి.సంపత్కుమారాచార్య (పల్లె ప్రగతి రాష్ట్ర సందర్శకుడు), బీయూవీఎన్ రాజు (విశాఖ స్టీల్స్ జనరల్ మేనేజర్) ఉన్నారు. ఇంకా కొంత మంది దేశ, రాష్ట్ర సర్వీసుల్లో పని చేసి విరమణ పొందారు.
అలుమినీ అసోసియేషన్ సేవలు అమోఘం..
అప్పటి ప్రిన్సిపాల్ వీవీ సత్యనారాయణ ప్రోద్బలంతో సర్వేల్ గురుకుల పూర్వ విద్యార్థుల సమాఖ్య ఏర్పడింది. 1991లో పూర్వ విద్యార్థి ఆర్కిటెక్ట్ గజ్జెల శివలీలానంద్ సహకారంతో పూర్వ విద్యార్థుల సమాఖ్య అలుమినీ అసోసియేషన్‌గా మారింది. అసోసియేషన్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, ఆరోగ్య పరీక్షలు, వ్యక్తిత్వ, వ్యాసరచన, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మృతిచెందిన ఐదుగురు పూర్వ విద్యార్థుల కుటుంబాలకు రూ.5నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం అందించారు. పాఠశాలలో తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.30లక్షలతో కంప్యూటర్ తరగతి గదులను నిర్మించారు. పూర్వ విద్యార్థి గంగసాని శ్రీనివాస్‌రెడ్డి రూ.25లక్షలను అలుమ్ని అసోసియేషన్‌కు విరాళంగా అందించారు.
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
గోల్డెన్ జూబ్లీ వేడుకలను దరాబాద్‌లోని నాగారం వద్ద గల ల్యాండ్‌మార్క్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేడుకలకు రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, డీజీపీ ప్రభాకర్‌రావు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రమణారావు హాజరు కానున్నారు. 2500 మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాటికొండ, కొడిహనహళ్లి పాఠశాలల పూర్వ విద్యార్థులు కూడా హాజరు కానున్నారు.
స్వర్ణోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు
సర్వేల్ గురుకులం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. 2500 మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా హాజరవుతారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు చిహ్నంగా పైలాన్‌ను ఆవిష్కరిస్తున్నాం. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కొడుకు పీవీ ప్రభాకర్‌రావు విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు.