పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నల్లానీరే ప్రామాణికం
రంగారెడ్డిజిల్లాలో 24 గ్రామపంచాయతీలు ఎంపిక
రెండు రోజులుగా జిల్లాలో 8 గ్రామాల్లో పర్యటన
మరో మూడు రోజులు పర్యటించనున్న బృందం సభ్యులు
గ్రామాల్లో శుభ్రతను బట్టి జిల్లాకు నేషనల్ ర్యాంకింగ్
స్వచ్ఛతగా ఉన్న గ్రామాలకు ప్రభుత్వం నుంచి నిధులు
షాబాద్, డిసెంబర్ 25 : పారిశుధ్యం, పరిశుభ్రతతోనే పల్లెల్లో ప్రజారోగ్యం మెరుగవుతుందని భావిస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రగతికి బాటలు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా స్వచ్ఛతను వంద శాతం పాటించే గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం రెండు రోజులుగా పర్యటిస్తున్నది. గ్రామాల్లో పారిశుధ్యం, తడి, పొడి చెత్త నిర్వహణ, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, ఇంటింటికీ నల్లానీరు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాకు నేషనల్ ర్యాంకింగ్ ఇవ్వనున్నారు. రంగారెడ్డిజిల్లాలో 21 గ్రామీణ మండలాల పరిధిలోని 558 గ్రామపంచాయతీలకు 24 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఆరుగురు కేంద్ర బృందం ప్రతినిధులు జిల్లాలో రెండు రోజులుగా వివిధ గ్రామాల్లో పర్యటించి మురుగుకాల్వలు, పారిశుధ్య పనులు, ఇంటింటికీ నల్లానీరు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త నిర్వహణ, కంపోస్టు ఎరువు తయారీ వంటి అంశాలపై ప్రత్యేక ఫార్మాట్లో ప్రజల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, వాటి ద్వారా అందుతున్న సేవలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు రోజుల పాటు షాబాద్, చేవెళ్ల, కేశంపేట మండలాల్లోని 8 గ్రామాల్లో పర్యటించగా, మరో మూడు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామాలను సందర్శించనున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 24 పంచాయతీల ఎంపిక
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 21 గ్రామీణ మండలాల పరిధిలో 558 గ్రామ పంచాయతీలున్నాయి. మొదటగా ప్రయోగాత్మకంగా 24 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర, రాష్ట్ర ప్రతినిధుల బృందం ఆకస్మికంగా ఎంపిక చేసుకున్న గ్రామాల్లో పర్యటించి వందశాతం మరుగుదొడ్లు, ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతలు, వీధుల్లో కంపచెట్లు లేకుండా చూడడం, డ్రైనేజీల్లో మట్టి, ఇసుక పేరుకుపోకుండా ఎప్పటికప్పుడూ శుభ్రం చేయడం, వాటర్ ట్యాంకులు శుభ్రంగా ఉంచడం, ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం తదితర వాటి వివరాలు సేకరిస్తున్నారు. వివిధ అంశాల్లో వంద శాతం అమలును పరిశీలించిన తర్వాత స్వచ్ఛతలో ఆదర్శ గ్రామాలను ప్రకటించి జిల్లాకు ర్యాంకింగ్ ఇవ్వనున్నారు.
గ్రామాలకు ప్రోత్సాహం
గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం వందశాతం ఉన్న గ్రామాలకు కేంద్రం నుంచి ప్రోత్సాహకం అందనుండగా, వందశాతం పరిశుభ్రత పాటించే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్‌యార్డు(చెత్త నిల్వకేంద్రం)నిర్మించాలని ఆదేశించిన ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా పనులను చేపట్టేలా వెసులుబాటు కల్పించింది. అన్ని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన డంపింగ్‌యార్డుల నిర్మాణాలతోపాటు పంచాయతీకి చెత్త సేకరణ కోసం ప్రభుత్వ నిధులతో అదనంగా రిక్షాలు, ట్రాక్టర్లు కొనుగోలు చేసి పంచాయతీ సిబ్బందితో చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేలా పంచాయతీ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో రెండు రోజుల పాటు 8 గ్రామాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి గ్రామాలు పరిశుభ్రంగానే దర్శనమిచ్చాయి. మరో మూడు రోజుల పాటు కేంద్రం బృందం జిల్లాలోని ఆయా పంచాయతీల్లో పర్యటించనుంది.