
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసింది
మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం కితాబు
చిన్నకోడూరు, నవంబర్ 21 : ‘రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లను చాలా త్వరగా పూర్తి చేసింది. ప్రభుత్వం నిర్మించిన అన్ని రిజర్వాయర్లలో నిండుగా నీళ్లున్నాయని” మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల బృందం, సీఈలు ఏఎన్ బహదూర్, ఏఎల్ పతాక్, పీజీ మందదె, ఎస్ఎం బెల్సరె, ఎస్ఈలు ఏటీ దేవ్గాడె, ఆర్ఎస్ దేశ్‌ముఖ్, ఎస్వీ చౌదరి, ఈఈలు ఎస్పీ అడె, ఎస్వీ హోజారె, ఏఏ సవంత్, ఎస్ఎస్ మున్నోలి, వీవీ బాగుల్, ఎస్జీ రాతి, ప్రణతి గోట్మారె, అరుణ్ నాయక్ వాడెలు అన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌తో పాటు చిన్నకోడూరు మండల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ను 15 మందితో కూడిన మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు బృందం ఆదివారం సందర్శించింది. రిజర్వాయర్, పంపుహౌస్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగు నీరందించాలనే గొప్ప ఆశయంతో భారీ వ్యయంతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరిగేషన్ అధికారుల శ్రమ ఎంతగానో ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. అనంతరం రంగనాయకసాగర్ గెస్ట్‌హౌస్‌లో మహారాష్ట్ర అధికారుల బృందాన్ని అధికారులు ఘనంగా సన్మానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం భేష్
తొగుట, నవంబర్ 21 : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి విన్నాం. కానీ, నేడు చూసిన తర్వాత ఇదొక అద్భుతమని మహారాష్ట్రకు చెందిన ఇంజినీర్లు ప్రశంసించారు. మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం సీఈలు ఏఎన్ బహదూర్, ఏఎల్ పతాక్, పీజీ మందదె, ఎస్ఎం బెల్సరె, ఎస్ఈలు ఏటీ దేవ్గాడె, ఆర్ఎస్ దేశ్‌ముఖ్, ఎస్వీ చౌదరి, ఈఈలు ఎస్పీ అడె, ఎస్వీ హోజారె, ఏఏ సవంత్, ఎస్ఎస్ మున్నోలి, వీవీ బాగుల్, ఎస్జీ రాతి తమ బృందంతో రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఆర్అండ్ఆర్ కాలనీ గజ్వేల్‌ను వారు పరిశీలించారు. రెండు, మూడేండ్లలో ప్రాజెక్టు ఎలా నిర్మించారని వారు మల్లన్న సాగర్ ఎస్ఈ వేణును అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో ఇంజినీరింగ్ బృందం పనులు పూర్తి చేసిన విధానాన్ని తెలియజేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీని చూసి వారు సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఈఈలు వెంకటేశ్వర్రావు, గోపాలకృష్ణ, రవీందర్‌రెడ్డి ఉన్నారు.