రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్‌లో వీధి వ్యాపారుల దుకాణాలు ప్రారంభం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 21 : నిర్మల్ పట్టణంలో నిర్మించే సమీకృత మార్కెట్‌తో జిల్లా ప్రజల సమస్యలు దూరం కానున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల కోసం నూతనంగా నిర్మించిన 13 దుకాణాలను మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌తో కలిసి శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు వీధి వ్యాపారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని 300 దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేసుకోగా, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈద్గాంలో 13 దుకాణ సముదాయాలను నిర్మించామని పేర్కొన్నారు. చేపల మార్కెట్ వద్ద రూ.50 లక్షలతో ఫిష్ మార్కెట్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 300 దుకాణాల ఏర్పాటుకు కావాల్సిన పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు.. ఇలా అన్ని రకాల సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, వైస్ చైర్మన్ సాజిద్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, రఫీ ఫర్జాన, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, శ్రీధర్, సలీం, గజేంధర్, సోమేశ్ పాల్గొన్నారు.
మెడికల్ దుకాణం ప్రారంభం..
పట్టణంలోని స్థానిక శాంతినగర్ ఎక్స్‌రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ లక్ష్మీ ఫార్మసీని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లాగా ఏర్పాటు కావడంతో వ్యాపార, వాణిజ్య రంగం రోజురోజుకూ విస్తరిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజలయక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ గండ్రత్ రమణ, శిరీష్ రెడ్డి తదితరులున్నారు.
శ్రీనివాస్ మృతి బాధాకరం..
సోన్, ఆగస్టు 21 : టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జిల్కర శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో కుటుంబసభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. మంత్రి వెంట జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దీన్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నాయకుడు అంకం శ్రీనివాస్, తదితరులున్నారు.