కరోనాతో కళతప్పిన కార్తిక మాసానికి పునరుజ్జీవం
రెండేండ్ల తర్వాత ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు
వన భోజనాలు, దీపారాధనలో భక్తులు
ఉమ్మడి జిల్లాలో వనభోజనాలకు పలు ప్రాంతాలు అనుకూలం
నారాయణఖేడ్, నవంబర్ 20;జిల్లావ్యాప్తంగా కార్తిక శోభ ఉట్టిపడుతున్నది. ప్రత్యేక పూజలు, పవిత్ర స్నానాలు, దీపారాధనలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్నది. వనభోజనాలతో చిన్నా, పెద్దా సందడి చేస్తున్నారు. శివకేశవులకు ప్రీతిపాత్రం, ఎంతో విశిష్టత కలిగిన మాసం కావడంతో ఈ నెలంతా నియమనిష్టలు పాటిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేండ్లుగా వేడుకలకు దూరంగా ఉన్న భక్తులు, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వనభోజనాలకు వెళ్తున్నారు. సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.
కరోనాతో వనభోజనాలకు బ్రేక్…
ఈ మాసంలో అందరినీ ఆకట్టుకునే ఆచారం దీపారాధన. కాగా, ఆహ్లాదం నింపేది వనభోజనాలు. ఈ రెండూ సామూహికంగా జరుపుకోవడం అనివార్యమైన కారణంగా ఈ కార్యక్రమాలపై కరోనా ప్రభావం పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నలుగురు ఒకచోట చేరడమే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో నదుల్లో చేయాల్సిన కార్తిక స్నానాలు, మహిళలు పెద్ద సంఖ్యలో చేపట్టే దీపారాధన, సామూహికంగా నిర్వహించే వనభోజనాలకు ఏ విధంగానూ అవకాశం లేకుండా పోయిం ది. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నీడలు తొలగిపోతున్న కారణంగా తిరిగి ఆయా ఆచారాలను కొనసాగించేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. రెండేండ్ల తర్వాత నారాయణఖేడ్‌లోని కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు నిర్వహించారు.
వన భోజనాలకున్న ప్రత్యేకత…
వన భోజనాల ఆచారం ఉసిరి చెట్టు వల్ల వచ్చిందని పెద్దలు చెబుతారు. కార్తికమాసంలోనే ఉసిరికాయలు విరగకాయడం ఒకటైతే, ఇదే సమయంలో ఉసిరి చెట్టుపై శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడని, ఆయన చెంతనే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు నీడన వంటలు వండి తులసి చెట్టుకు నివేదించి భుజించడం ద్వారా అష్ట ఐశ్యర్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ఇక, ఆరోగ్యపరంగా చూస్తే అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లు, మొక్కల మధ్య స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణంలో భోజనాలు చేయడం ఎంతో శ్రేయస్కరమనేది అందరికీ తెలిసిందే. దీనికి తోడు సామూహికంగా వన భోజనాలు చేయడం పరస్పర సత్సంబంధాలు మెరుగు పడడం, రకరకాల మనస్తత్వాలు ఒకచోట చేరడంతో సాన్నిహిత్యం పెరగడం వంటి సామాజిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.
అనువైన ప్రదేశాలు..
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల్లోని పలు ప్రాంతాలు వనభోజనాలకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా పోచారం అటవీ ప్రాం తంలో ఉసిరి వనం ఉన్నందున ఈ ప్రదేశం అత్యంత అనువైనదిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయ పరిసర ప్రదేశాలు వనభోజనాలకు అనువుగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే, పెద్దశంకరంపేట సమీపంలోని కొప్పోల్ సంగమేశ్వరాలయ పరిసరాలు, మనూరు మండలం బోరంచ నల్లపోచమ్మతల్లి ఆలయ పరిసరాలు, కల్హేర్ మండలం మాసాన్‌పల్లి శివారులోని ఉసిరి వనం, సిర్గాపూర్ మండలం కడ్పల్ శివారులో కొండపై ఉన్న శివాలయ ప్రాంతం, అల్లాదుర్గం సమీపంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం, నారాయణఖేడ్ వద్ద కొండాపూర్ ఆంజనేయస్వామి ఆల యం, కంగ్టి దగ్గర సిద్దేశ్వరాలయ పరిసర ప్రదేశాలు వనభోజనాలకు అనుకూలంగా ఉంటాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, రిజర్వాయర్లు, పార్కులు అనువుగా ఉన్నాయి.