
సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : తెల్ల వారితే శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విశాదం అలుముకున్నది. అనారోగ్యంతో తండ్రి చనిపోగా తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఇద్దరు కుమార్తెలు ఉన్న ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలోకి పోయింది. మండలం నంద్యాలవారిగూడెం గ్రామానికి చెందిన నంద్యాల వెంకట్‌రెడ్డి-శోభ దంపతులు. వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లో చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. తెల్లారితే పెద్ద కుమార్తె శ్రావ్య నిశ్చితార్థం కావడంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యంతో వెంకట్‌రెడ్డి తండ్రి సత్తిరెడ్డి మరణించగా తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన వెంకట్‌రెడ్డి గుండెపోటుతో తనువు చాలించాడు. దాంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా అంధకారం అలుముకున్నది.
అండగా నిలిచిన మంత్రి
తండ్రీకొడుకు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నంద్యాలవారిగూడేనికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా నిలబడుతానని హామీ ఇచ్చారు.
ఘనంగా శ్రావ్య వివాహం..
వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కూతురు శ్రావ్య వివాహాన్ని దగ్గరుండి ఘనంగా జరిపించారు. శనివారం సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉదయం 9.30 గంటలకు పెండ్లి వైభవంగా జరిగింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, సునీత దంపతులు దగ్గరుండి శ్రావ్య వివాహం జరిపించి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెండ్లి ఖర్చంతా పెట్టుకున్న మంత్రి ఔదార్యానికి దాసోహమైన నంద్యాలగూడెంవాసులతోపాటు బంధు మిత్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.