
భవిష్యత్‌లో ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మారుస్తాం..
వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తికావాలి
ప్రోగ్రాం ఆఫీసర్లను నియమించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి
మండలం, గ్రామాల వారీగా వ్యాక్సినేషన్‌పై డిక్లరేషన్ ఇవ్వాలి
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు పీహెచ్సీలో ఆశకార్యకర్తలకు మొబైల్ సిమ్‌లు అందజేత
చిన్నకోడూరు, నవంబర్ 20 : రోగులకు సేవలందించడం వైద్యసిబ్బంది అదృష్టంగా భావించాలని, ఉత్తమ సేవలు అందించి మంచిపేరు పొందాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఎఫ్డీసీ చైర్మన్ వం టేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి 49మంది ఆశకార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్‌కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో భవిష్యత్‌లో ప్రతీ ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏఎన్ఎం కేంద్రంలో స్టాఫ్‌నర్సు, వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.
24 గంటలు సేవలందించాలి..
ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని, వైద్యాధికారులు, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 24/7 వైద్య సేవలు అందించాలని, సమయపాలన తప్పనిసరిగా పా టించాలని ఆదేశించారు. అవసరమైన మందుల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ కూడా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోనే ఉన్నదని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రజల్లో ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం పెరిగేలా ఓపికతో పనిచేయాలని సూచించారు. ప్రతీ పీహెచ్సీలో పాము, కుక్క, తేలు కాటు వైద్యం కోసం అర్ధరాత్రి వచ్చినా బాధితులకు మందులు ఇచ్చి కాపాడుకోవాలన్నారు.
వైద్యాధికారులకు సూచనలు..
అనంతరం చిన్నకోడూరు పీహెచ్సీలో జిల్లా వైద్యాధికారి మనోహర్‌తో కలిసి ఏ వైద్యాధికారి ఏ విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మెటర్నరీ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రజినీతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణుల శాతాన్ని పెంచాలని ఆదేశించారు. విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రోగ్రాం ఆఫీసర్ రాధికతో మంత్రి మాట్లాడారు. టెలీ మెడిసిన్ అమలు, పెద్ద దవాఖానలకు రెఫర్, బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. బీపీ, షుగర్ బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు టీబీ ప్రోగ్రాం అధికారి వెంకటేశ్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో టీబీ రికవరీ రేట్ 98శాతం ఉందని, జిల్లాలో 1648 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని ఐదుగురు ప్రోగ్రామ్ ఆఫీసర్లు వివిధ సందర్భాల్లో ఒకేసారి అందరూ పీహెచ్‌సీల్లో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని, మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పోస్ట్ కొవిడ్ కేసుల్లో టీబీ కేసులు పెరుగుతున్నాయని పీవో వెంకటేశ్ మంత్రి దృష్టికి తేగా, ప్రతినెలా జాబ్‌చార్ట్ రిపోర్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి..
జిల్లాలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా పీవోలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా వైద్యాధికారి మనోహర్‌ను మంత్రి ఆదేశించారు. కరోనా వ్యా క్సిన్ 7 లక్షల మందికి గాను 6 లక్షల మంది మొదటి డోస్ వేసుకున్నట్లు, వీటిలో జిల్లాలోని 9 పీహెచ్సీ కేంద్రాలు వందశాతం పూర్తి చేశాయని మంత్రి దృష్టికి పీవో తీసు కువచ్చారు. సెకండ్ డోస్ త్వరితగతిన పూర్తి చేయించి మండలాలు, గ్రామాల వారీగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని డిక్లరేషన్ ఇచ్చేలా ప్రణాళికతో ముందుకు పోవాలని వైద్యాధికారులను మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం, జిల్లా అటవీ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, వైద్యురాలు సరిత, ఎంపీటీసీ శారద రమే శ్, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.