అత్తాపూర్, డిసెంబర్ 19 : అంతరించిపోతున్న మల్లయుద్ధాలను నేటి తరం యువకులకు తెలియజేయడం కోసం కుస్తీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అత్తాపూర్ రాంబాగ్‌లో స్థానికుడు రాజుపహిల్వాన్ ప్రతీ సంవత్సరం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుస్తీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేండ్లుగా కుస్తీ పోటీలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ ప్రపంచం నడుస్తుందని,, ఇలాంటి పోటీలను ఏర్పాటు చేయడం వల్ల కొంతైనా మార్పు వస్తుందన్నారు. మల్లయుద్ధంతో పాటు ఇతర సంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తామని తెలిపారు. మహనీయుల జయంతిని పురస్కరించుకొని సంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయించేందుకు కృషిచేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత, రాజేంద్రనగర్ ఏసీసీ గంగాధర్, ఇన్స్పెక్టర్లు కనకయ్య, వెంకటేశ్, వనం శ్రీరాంరెడ్డి, మల్లారెడ్డి, విజయ్మమార్, సుభాష్‌రెడ్డి, శ్రీధర్, రామేశ్వర్రావు, చిన్నా, కొమురయ్య, చిత్తారి, వెంకటేశ్, జయానంద్‌రెడ్డి, రాముయాదవ్ పాల్గొన్నారు.