ఈ నెల 20న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన చావుడప్పులు, రాస్తారోకోలు,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
రైతుల నుంచి కోటి సంతకాల సేకరణ
కులకచర్ల, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్లలోని పీఏసీఎస్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మాటలు చెబుతూ.. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నదని పేర్కొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సేకరించి ధాన్యం తీసుకోని కారణంగా నిల్వ ఉందన్నారు. వచ్చే యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని తీసుకోబోమని తేల్చి చెప్పిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 20న గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు పిలుపునిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను, రైతులకు జరిగే అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపారు. యాసంగిలో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, వానకాలంలో సాగు చేసే ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించాలన్నారు. వరి ధాన్యం తెలంగాణలో ఎక్కువగా పండిస్తారు కావున పూర్తిస్థాయిలో రైతులను కేంద్రం ఆదుకోవాలన్నారు. వానకాలానికి సంబంధించి రైతుల నుంచి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం చేతులెత్తేసిన కారణంగా రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని, అత్యవసర సమయంలో సన్నరకాలు వేస్తే నష్టం రాకుండా ఉంటుందన్నారు. వ్యవసాయశాఖ వారు సూచించే ఇతర పంటలు వేసి అధిక దిగుబడులు పొందాలన్నారు. ఈ నెల 20 నుంచి రైతుల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామగ్రామాన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అన్ని కాలాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.