ఉమ్మడి జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులు
జూలూరికి తెలంగాణ సాహిత్య అకాడమీ..
దూదిమెట్లకు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్
ప్రత్యేక అభిమానం చాటుకున్న సీఎం కేసీఆర్
కోదాడ రూరల్, డిసెంబర్ 17 : తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌గా కోదాడ ప్రాంత వాసి జూలూరి గౌరీ శంకర్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి సాహిత్య అకాడమీ చైర్మన్ కావడంతో కోదాడ పరిసర ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గౌరీశంకర్ గతంలో బీసీ కమిషన్ సభ్యుడుగానూ పనిచేశారు.
నేపథ్యం…
కోదాడ ప్రాంతం నడిగూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు జూలూరి చిన బసవయ్య, సక్కుబాయమ్మకు ఐదుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. వీరిలో పెద్దవాడైన గౌరీశంకర్ ప్రాథమిక విద్య, 6 నుంచి 9వ తరగతి వరకు నడిగూడెం, 10వ తరగతి అనంతగిరిలో చదివారు. ఇంటర్, డిగ్రీ కోదాడ కేఆర్ఆర్ కళాశాలలో, శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అనంతరం కళాశాల అధ్యాపకులుగా, జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. నల్లగొండ, పల్నాడు ఏరియా, విజయవాడలో సీనియర్ జర్నలిస్టుగా, హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం ఎడ్యుకేషన్ రిపోర్టర్‌గా పనిచేశారు. ప్రవృత్తిగా కవిత్వం, వ్యాసాలు రాయడం, సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తాను నెలకొల్పిన స్పృహ సాహితీ సంస్థ ద్వారా పలు పుస్తకాలు ముద్రించారు. మలిదశ ఉద్యమంలో తొలి వచన దీర్ఘకవిత ‘నా తెలంగాణ’ కావ్యాన్ని రచించి ఉద్యమంలోనూ పాల్పంచుకున్నారు. ఎన్ఆర్ఐ తెలంగాణ వాదులను ఏకం చేసేందుకు ‘పొక్కిలి’ రచన ఎంతగానో ఉపయోగపడింది. 2001లో ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ అన్న తొలి బీసీ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. తెలంగాణ సాధన కోసం ఈ ప్రాంత రచయితలను ఏకం చేసేందుకు తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేసి 2006 నుంచి 2014 వరకు అధ్యక్ష, కార్యదర్శులుగా, చుక్కారామయ్య విద్యాపీఠం అధ్యక్షుడిగా కొనసాగారు. 2006 విశాఖపట్నం గాజువాకలో జరిగిన తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొని ఆంధ్రా కవులారా మీరెటువైపు అని గొంతెత్తి ప్రశ్నించి అలజడిని సృష్టించారు.
ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య హయాంలో తెలుగు మహాసభల నిర్వహణను తెరవే ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకించి రద్దు చేసే వరకూ పోరాడారు. ఆంధ్ర ప్రాంతంలో పలు ప్రధాన నగరాల్లో జరిగిన సాహిత్య సదస్సుల్లో పాల్గొని ఆంధ్రావారితో ‘జై తెలంగాణ’ అనిపించారు. తెలంగాణ సాధన కోసం నిర్మించిన ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో అధ్యాపకుడిగా నటించారు. 2009 డిసెంబర్ 9న ఉస్మానియా విద్యార్థులకు సంఘీభావం కార్యక్రమంలో పాల్గొని అరెస్టయ్యారు. 42 రోజుల సకల జనుల సమ్మెపై 1,600 పేజీలతో రెండు డాక్యుమెంటేషన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జయుడు, జయశంకరా కవితా సంకలనాలు రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.