
రికార్డుల భద్రత, సమయం ఆదా వంటివి ప్రయోజనాలు: ఖమ్మం కలెక్టర్
మామిళ్లగూడెం, నవంబర్ 15: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు . జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ఈ – ఆఫీస్’ విధానం అమలుపై దిశా నిర్దేశం చేశారు. ‘ఈ – ఆఫీస్’ విధానం వల్ల రికార్డులకు పూర్తి భద్రత ఉంటుందని, సమయం ఆదా అవుతుందని, అవకతవకలకు ఆసారం ఉండదని అన్నారు. ఈ విధానం ఆఫీస్ మాన్యువల్ ప్రకారంగానే ఉంటుందని, తప్పులు జరిగే ఆసారం ఉండదని, ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డులు శాశ్వతంగా ఉంటాయని, ఫైళ్ల నిర్వహణ క్రమపద్ధతిన సక్రమంగా ఉంటుందని వివరించారు. వచ్చే వారం నుంచి జిల్లా అధికారులందరూ తమ కార్యాలయాల్లో తప్పనిసరిగా ‘ఈ – ఆఫీస్’ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.