రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిన జిల్లా
వారం, పది రోజుల్లో వంద శాతం పూర్తి చేసేలా కార్యాచరణ
ఇంటింటి సర్వే.. జనం వద్దకే వెళ్లి టీకా వేస్తున్న సిబ్బంది
ముమ్మరంగా కొవిడ్ వ్యాక్సినేషన్
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ టీకాల లక్ష్యం నెరవేర్చేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్‌తో నూరు శాతం లక్ష్యం చేరువవుతున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతుండడంతో ఇప్పటివరకు టీకాలకు దూరంగా ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో 98.56 శాతం మందికి మొదటి డోసు పూర్తికాగా, మిగిలిపోయిన వారి వివరాలను సేకరిస్తున్న అధికారులు అందరికీ టీకా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ ఇస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందాలంటే టీకా వేసుకోవడం ఒక్కటే మార్గమని పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దిశానిర్దేశంలో వైద్యారోగ్య శాఖాధికారులు ముందుకు సాగుతున్నారు. రోజూ 5వేల మందికి టీకాలు వేయాలనే లక్ష్యంగా నిర్ణయించి కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. మండలాల్లోనూ బాధ్యులను నియమించారు. ఇప్పటివరకు టీకా వేసుకోని వారి వివరాలను సేకరించేందుకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. గుర్తించిన వారికి అక్కడికక్కడే టీకాలు వేస్తున్నారు. టీకా విషయంలో నెలకొన్న అపోహలను తొలగించడంతో పాటు ఈ విషయంలో ఆసక్తి చూపనివారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
అన్ని శాఖల సాయంతో
వారం, పది రోజుల్లో టీకా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఇంకా టీకా తీసుకోని వారి వివరాలను సేకరించి వారందరికీ టీకా వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆయా, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, స్వయం సహాయక సంఘాల మహిళలు, డీఆర్డీఏ-ఐకేపీ సిబ్బంది బృందంలో ఉండి వ్యాక్సినేషన్ విజయవంతానికి సహకరిస్తున్నారు. మండలాల్లో ఎంపీడీఓలు, తాసీల్దార్లు, ఏపీఎంలు, ఏపీఓలు, మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్లు, కమిషనర్లు, ఆర్డీఓలు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణలో పాల్పపంచుకుంటున్నారు.
లక్ష్యం సాధనకు కృషి
జిల్లాలో సాధ్యమైనంత త్వరగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడానికి కృషిచేస్తున్నాం. ఇందుకు ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటున్నాం. వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు సిబ్బంది కూడా గ్రామాల్లో తిరుగుతూ టీకాలు ఇస్తున్నారు. ఇంటింటి సర్వేతో ప్రజల వద్దకే వెళ్లి టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వారం, పదిరోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసేలా అన్నిశాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం.