స్వామివారికి వైభవంగా నిత్యపూజలు
శ్రీవారి ఖజానాకు రూ.18,85,439 ఆదాయం
యాదాద్రి, డిసెంబర్ 13: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించిన అర్చక బృందం సుదర్శన నారసింహ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో జరిపించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక వ్రత పూజలు చేశారు. పూర్వగిరి(పాతగుట్ట) నరసింహ స్వామి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. యాదాద్రిలో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి.
పంచామృతాలతో అభిషేకం
యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయంలో పురోహితులు పరమశివుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కొండపై క్యూ కాంప్లెక్స్‌లో వెలసిన బాలశివాలయంలో ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివున్ని కొలుస్తూ రుద్రాభిషేకం చేశారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరించారు. శివాలయ ప్రధాన పురోహితుడు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. శ్రీవారి ఖజానాకు సోమవారం రూ. 18,85,439 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
పాతగుట్టలో తూర్పు రాజగోపురం నిర్మాణానికి పూజలు..
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట(పూర్వగిరి) ఆలయ తూర్పు రాజగోపుర నిర్మాణాలకు ఆలయాధికారులు ప్రత్యేక పూజలు చేశారు. గతంలో పాతగుట్ట ఆలయానికి రాజగోపురం లేనందున ఆలయ ఈఓ ఎన్.గీత ప్రత్యేక చొరవతో రాజగోపురం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సిబ్బందికి పీఆర్సీ పెంచినందున సిబ్బంది సుమారు రూ.30లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూజలు నిర్వహించి గోపురం నిర్మాణానికి అంకురార్పన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి ప్రధానాలయంలో ధారు పూజలు
యాదాద్రి నరసింహ స్వామి ప్రధానాలయ మాఢవీదుల్లో ధారు పూజలు చేపట్టారు. వచ్చే ఏడాది మార్చి 28న ఆలయ పునః ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆలయాధికారులు, వైటీడీఏ సిబ్బంది కలశ స్థాపన పనులు ప్రారంభించారు. ఆలయ పశ్చిమ దిశలో ఉన్న సప్తతల మహారాజ గోపురంపై కలశ స్థాపనకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయాధికారి దయాకర్‌రెడ్డి, డిప్యూటీ స్తపతి ఆకుల మొగిలి పాల్గొన్నారు.