భువనగిరి అర్బన్, డిసెంబర్ 13 : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ అధికారులకు సూచించారు. సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రిమి సంహారక మందులు, ఎరువుల కన్నా తక్కువ ఖర్చుతో ఆరోగ్యానికి మేలు చేసే సహజమైన సేందియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందనే విషయాన్ని రైతులకు తెలపాలన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడడంతో పాటు బొప్పాయి పండ్లు, బియ్యం ప్యాకెట్ కొనుగోలు చేశారు. జిల్లాలో సేంద్రియ ఎరువులతో పంటలు పండించే 62మంది రైతులను గుర్తించి సమన్వయపర్చి ప్రతి సోమవారమూ కలెక్టరేట్ వద్ద విక్రయ కేంద్రంలో ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి అనూరాధ కలెక్టర్‌కు వివరించారు. ఆత్మకూరు మండలం టీరేపాక గ్రామ రైతు బండ యాదగిరి బియ్యం, నెయ్యి ఉత్పత్తులను ఆలేరు మండల కేంద్రానికి చెందిన వ్యాపన ఎఫ్.పి.ఓ రైతు సంఘం సభ్యులు సుధీర్, శ్రీకాంత్, రైతులు తాము పండించిన బొప్పాయ పండ్లను విక్రయించారు.
ఓటరు దరఖాస్తులను 20లోగా పరిష్కరించాలి
భువనగిరి అర్బన్, డిసెంబర్ 13 : జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించిన దరఖాస్త్తులను ఈ నెల 20లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లకు సూచించారు. ఓటరు ధ్రువీకరణ, ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌పై కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ నీలిమ పాల్గొన్నారు.