కాపాడిన కలెక్టరేట్ సిబ్బంది
భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు
భువనగిరి అర్బన్, డిసెంబర్ 13 : తమకు రావాల్సిన భూమిని రికార్డులో నమోదు చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని భువనగిరి కలెక్టరేట్ చాంబర్లో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోగా.. గమనించిన కార్యాలయ సిబ్బంది అడ్డుకొని కాపాడారు.
తమ కుంటుంబానికి రావాల్సిన భూమిని రికార్డులో నమోదు చేయాలని కోరుతూ పది సంవత్సరాల నుంచి తన తండ్రి బొడిగె ఉప్పలయ్య తాసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి అనారోగ్యానికి గురయ్యాడని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బొడిగె మహేశ్ పేర్కొన్నాడు. తామిక తిరుగలేమని, ఓపిక నశించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లోకి వెళ్లి సీసీ గది, మెయిన్ గదికున్న రెండు డోర్లు పెట్టి తన వెంట క్యాన్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. గదిలోంచి పెట్రోల్ వాసన రావడంతో బయట ఉన్న కలెక్టరేట్ సిబ్బంది డోర్లు పగులగొట్టి బయటకు తీసుకొచ్చి అతనిపై నీళ్లు పోశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌కు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.
బాధితుడు మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పరిధిలోని 1732, 1733, 1737, 1738, 1742లో సర్వే నంబర్లలో మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగు ఎకరాలు రికార్డులో నమోదు చేయడం లేదు. ఈ విషయంపై 2006 నుంచి పట్వారీ, తాసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరుగడం లేదు. ఈ విషయంపై 2016లో ఆర్డీఓ కార్యాలయంలోని రెవెన్యూ కోర్టుకు వెళ్లగా.. గతంలో ఉన్న కలెక్టర్ ఆదేశాలతో అప్పటి ఆలేరు తాసీల్దార్ శ్యాంసుందర్ సర్వే చేసి కబ్జాలో తామే ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ కేసును ఆర్డీఓ కోర్టు నుంచి కలెక్టర్ నేతృత్వంలో ట్రిబ్యునల్‌కు బదిలీ చేసిన తర్వాత డిస్మిస్ చేశారు. మళ్లీ సివిల్ కోర్టుకు వెళ్లమంటున్నారు. ఆఫీసర్ల చుట్టూ తిరుగలేక తన తండ్రి ఉప్పలయ్య అనారోగ్యానానికి గురయ్యాడు. ఏండ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం జరుగలేదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు యత్నించా. అని మహేశ్ చెప్పాడు.
భూమిని పరిశీలించిన అధికారులు
ఈ విషయంపై కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు కొలనుపాక గ్రామ పరిధిలోని భూమిని ఆలేరు తాసీల్దార్ గణేశ్‌నాయక్, మండల రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పూర్తి వివరాలు సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. రికార్డు ప్రకారం అవకతకలు, భూ యజమానుల నుంచి అభ్యంతరాలు లేకుంటే న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పినట్లు మహేశ్ తెలిపారు